India Q2 GDP Growth : భారత ఆర్థిక వృద్ధిరేటు రెండేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, గతేడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 8.1 శాతం ఉండగా, ఈ సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 5.4 శాతానికి పడిపోయింది. తయారీ రంగంలో వృద్ధి పడకేయమే ఇందుకు కారణం.
చైనా కంటే మెరుగే!
ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి 4.6 శాతంగా ఉంది. ఇదే సమయంలో భారత ఆర్థిక వృద్ధి 5.4 శాతంగా ఉంది. కనుక భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందున్న ఆర్థిక వ్యవస్థగానే ఇంకా కొనసాగుతోంది.
2022-23 ఆర్థిక సంవత్సరం (అక్టోబర్-డిసెంబర్ 2022) మూడో త్రైమాసికంలో భారత్ ఆర్థిక వృద్ధి 4.3 శాతంగా ఉంది. ప్రస్తుత జీడీపీతో పోల్చితే ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.
వ్యవసాయ రంగం వృద్ధి
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) గణాంకాల ప్రకారం, వ్యవసాయ రంగం జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) అనేది 2023-24 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 3.5 శాతంగా ఉంది. గతేడాదితో (జీవీఏ 1.7 శాతం) పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం.
దెబ్బతిన్న తయారీ రంగం
గతేడాది రెండో త్రైమాసికంలో భారత తయారీ రంగం జీవీఏ 14.3 శాతంగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.2 శాతానికి క్షీణించింది.
2024-25 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 6 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి అర్థ భాగంలో ఇది 8.2 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 6.7 శాతం వద్దనే ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది.
హైప్ ఎక్కువ - వృద్ధి తక్కువ!
2024 రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వద్ధి మందగించిన నేపథ్యంలో, మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. 'ప్రధాని మోదీ, అతని చీర్‌లీడర్స్ దేశవృద్ధి గురించి అనవసర హైప్ క్రియేట్ చేస్తున్నారు. కానీ తాజా గణాంకాలు అవన్నీ ఎంత వాస్తవ దూరంలో ఉన్నాయో తేల్చి చెబుతున్నాయి' అని ఘాటుగా విమర్శించింది.
'మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలం నాటి ఆర్థిక వృద్ధితో పోల్చితే, నేటి మోదీ సర్కార్ హయాంలో దేశ ఆర్థిక వృద్ధి చాలా దారణంగా ఉంది' అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ జైరాం రమేశ్ ఘాటుగా విమర్శించారు.