Paytm Payments Bank RBI ban Can You Port Wallet FASTags : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) ఫిబ్రవరి 29 తరువాత ఖాతాదారుల నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆర్బీఐ ఆదేశించింది. అలాగా పేటీఎం అందించే పలు సేవలపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో పేటీఎం ఖాతాదారుల పరిస్థితి ఏమిటి? వాళ్ల డబ్బులు సురక్షితమేనా? పేటీఎం వాలెట్స్, ఫాస్టాగ్ల్లోని డబ్బులు వాడుకోవచ్చా? మొదలైన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యూపీఐ పేమెంట్స్
పేటీఎం యూజర్లు ఫిబ్రవరి 29 వరకు యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. కనుక వారిపై తక్షణ ప్రభావం ఏమీ ఉండదు. కానీ ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుపడదు. కనుక ఇప్పటి నుంచే మరో ప్రత్యామ్నాయం ఎంచుకోవడం మంచిది. ఒకవేళ మీ యూపీఐ ఐడీ - ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి ఇతర బ్యాంకులతో లింక్ అయ్యుంటే మీకు ఎలాంటి సమస్య ఏర్పడదు. కనుక నేరుగా ఎప్పటిలానే యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు.
పేటీఎం వాలెట్ సంగతేంటి?
పేటీఎం వాలెట్ అనేది పూర్తిగా పీపీబీఎల్‌పై ఆధారపడి ఉంటుంది. పైగా ఫిబ్రవరి 29 వరకు మాత్రమే మీరు పేటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయగలుగుతారు. ఆ తరువాత కుదరదు. ఒకవేళ మీకు డబ్బులు అవసరమైతే ఇప్పటివరకు పేటీఎంలో ఉన్న డబ్బులు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి వీలవుతుంది. ఖాతాదారులు కోరుకుంటే వారి పేటీఎం వాలెట్లోని డబ్బును ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండా ఇతర బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
సబ్-వాలెట్ల పరిస్థితి ఏమిటి?
ఫిబ్రవరి 29 తరువాత ఖాతాదారులు పేటీఎం ద్వారా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, టాప్-అప్లు చేయలేరు. అలాగే ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్టాగ్ ఉపయోగించలేరు. మెట్రోల్లో ఉపయోగించే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు (NCMC), ఫుడ్, ఫ్యూయెల్ కార్డులు కూడా వాడలేరు. అయితే పేటీఎం యూజర్లు తమ ఖాతాల్లోని నిధులను ఫిబ్రవరి 29 వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వాడుకోవచ్చు.
ఫాస్టాగ్ పని చేస్తుందా?
ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం ఫాస్టాగ్‌లు పనిచేయవు. కనుక పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు వీలైనంత త్వరగా ఇతర ఫాస్టాగ్‌లను కొనుగోలు చేసుకోవడం మంచిది. వాస్తవానికి దేశంలో ఫాస్టాగ్‌లు జారీ చేస్తున్న అతిపెద్ద సంస్థల్లో పేటీఎం మూడో స్థానంలో ఉంది. గత ఏడాది పేటీఎం ఏకంగా 58 మిలియన్ల ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్లను ప్రాసెస్ చేసింది. కానీ ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం ఫాస్టాగ్ పనిచేయదు. కనుక యూజర్లపై చాలా ప్రభావం పడనుంది.