PAN Card Loans :ఆర్థిక అవసరాలు ఏర్పడినప్పుడు వ్యక్తిగత రుణాలను తీసుకోవడం తప్పేం కాదు. వాటివల్ల అత్యవసరంగా డబ్బులు చేతికి అందడమే కాదు తిరిగి చెల్లించేందుకు సులభమైన మార్గాలు అందుబాటులో ఉంటాయి. కేవలం పాన్ కార్డుతోనూ రూ.5వేల దాకా రుణాన్ని పొందొచ్చు. ఈ లోన్‌ను పొందే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. అదేలాగో ఈ స్టోరీలో చూద్దాం.
ఈ రుణం ఎవరు ఇస్తారు ?
ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు లాగే పాన్ కార్డు సైతం ముఖ్యమైన డాక్యుమెంట్. చాలా రుణాలను పొందే క్రమంలో పాన్ కార్డ్ వెరిఫికేషన్ చేస్తారు. క్రెడిట్ స్కోరు బాగుండి, చేతిలో పాన్ కార్డు ఉంటే చాలు రూ.5వేల దాకా రుణం లభిస్తుంది. పలు బ్యాంకులు, డిజిటల్ రుణ వేదికలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఈ చిన్నతరహా రుణాన్ని అందిస్తున్నాయి.
తెలుసుకోవాల్సిన విషయాలు
వడ్డీరేటు, ప్రాసెసింగ్ ఫీజు తక్కువగా ఉండే సంస్థ నుంచే రుణం తీసుకోండి. వీటన్నింటితో పాటు రుణం తిరిగి చెల్లింపునకు సాధ్యమైనంత ఎక్కువ గడువును ఇచ్చే సంస్థనే ఎంచుకోండి. ఈ రుణానికి దరఖాస్తు చేసే క్రమంలో పాన్ కార్డుతో పాటు ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు/ఆర్థిక సంస్థలు తప్పకుండా పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయ వివరాలతో కూడిన బ్యాంకు స్టేట్‌మెంట్‌లను ఇవ్వాలనే షరతు పెడుతుంటాయి. అదనంగా పూచీకత్తు(ష్యూరిటీ)ను కూడా అందిస్తే రుణ మొత్తాన్ని పెంచేందుకు సదరు బ్యాంకులు అంగీకరించే అవకాశం ఉంటుంది.