Osamu Suzuki Passes Away :సుజుకి మోటార్స్ మాజీ ఛైర్మన్ ఒసాము సుజుకి (94) కన్నుమూశారు. గత కొంత కాలంగా ప్రాణాంతక లింఫోమాతో పోరాడుతున్న ఆయన డిసెంబర్ 25న తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు తోషిహిరో సుజుకి తెలిపారు. ఒసాము సుజుకి కోరిక మేరకు సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
సంతాప సందేశాలు వద్దు!
ఒసాము సుజుకి చివరి కోరిక మేరకు ప్రజలు ఎవ్వరూ సంతాపాలు తెలియజేయవద్దని ఆయన కుమారుడు తోషిహిరా సుజుకి కోరారు. తాము కూడా ఎలాంటి సంతాప సభలు నిర్వహించడం లేదని ఆయన స్పష్టం చేశారు. అభిమానులు ఎవ్వరూ పుష్పాలు లేదా పూలదండలు, పరిమళ ద్రవ్యాలు, సంతాపం తెలుపుతూ టెలిగ్రామ్‌లు పంపించవద్దని విజ్ఞప్తి చేశారు.
గ్రేట్ అచీవ్‌మెంట్
ఒసాము సుజుకి ఏకంగా 40 ఏళ్లపాటు సుజుకి మోటార్స్ కంపెనీని నడిపించారు. 1958లో సుజుకి మోటార్స్‌లో చేరిన ఆయన 1978లో ప్రెసిడెంట్ అయ్యారు. తరువాత 2000లో కంపెనీ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. 2 పర్యాయాలు కలిపి, ఆయన ఏకంగా 28 ఏళ్లపాటు కంపెనీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ విధంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం ఓ ఆటోమొబైల్ కంపెనీకి ప్రెసిడెంట్‌గా పనిచేసిన వాడిగా ఒసాము సుజుకి నిలిచారు. 2021లో తన 91 ఏట ఆయన స్వయంగా రిటైర్‌మెంట్ ప్రకటించారు.
వాస్తవానికి 2015 జూన్‌లోనే ఒసాము సుజుకి కంపెనీ అధ్యక్ష బాధ్యతలను తన కుమారుడికి అప్పగించారు. తరువాత ఆయన కంపెనీ ఛైర్మన్‌గా, సీఈఓగా కొనసాగారు. ఒసాము సుజుకి తన పదవీకాలంలో - కాంపాక్ట్ కార్ల తయారీలో సుజుకి మోటార్స్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపారు. 1983లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించారు. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌లో అత్యధిక వాటాను కైవసం చేసుకున్నారు. ఇండియా అమ్మే ప్రతి రెండు కార్లలో ఒకటి మారుతి సుజుకిదే కావడం గమనార్హం.
సుజుకి జీవన ప్రస్థానం
ఒసాము సుజుకి 1930 జనవరి 30న ఓ వ్యవసాయ కుటుంబంలో నాల్గో సంతానంగా జన్మించారు. జీరో (Gero) అనే ఊరికి చెందిన ఆయన మొదట్లో రాజకీయ నాయకుడు కావాలని ఆశించారు. ఆయన టోక్యోలోని చువో విశ్వవిద్యాలయంలో లా డిగ్రీ చదువుతూనే, జూనియర్ హైస్కూల్‌లో టీచర్‌గా, నైట్ గార్డ్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేశారు. డిగ్రీ పూర్తి చేశాక, ఓ బ్యాంక్‌లో పనిచేశారు. తరువాత ఆయనకు షోకో సుజుకితో వివాహం జరిగింది. ఇక్కడే ఆయన జీవితం మేలిమలుపు తిరిగింది. షోకో సుజుకి - స్వయాన సుజుకి మోటార్స్ అధినేతకు మనవరాలు అవుతుంది. ఆయనకు మగవారసులు ఎవరూ లేరు. దీనితో జపనీస్ ఆచారం ప్రకారం, ఒసాము సుజుకి తన భార్య ఇంటిపేరును తీసుకుని ఆటోమొబైల్ వ్యాపారంలోకి ప్రవేశించారు.