One Nation One Gold Rate : దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రధాన నగరంలో బంగారం రేట్లు మారుతూ ఉంటాయి. పన్నులు, రవాణా ఖర్చులు, స్థానికంగా ఉన్న డిమాండ్‌తో పాటు అనేక ఇతర విషయాలు బంగారం ధరపై ప్రభావం చూపిస్తాయి. తక్కువ పన్నులు, బలమైన మార్కెట్ పోటీ ఉన్న రాష్ట్రాలు తక్కువ ధరకు బంగారాన్ని అందిస్తాయి. అధిక పన్నుల భారం ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో పసిడి రేటు ఎక్కువగా ఉంటుంది. బంగారంపై 'వన్ నేషన్ - వన్ రేట్' పాలసీ త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా బంగారం ధరలు ఒకేలా ఉంటాయి.
ఇకపై దేశమంతటా ఒకే ధర!
'వన్ నేషన్ వన్ రేట్' విధానానికి జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్(GJC) ఆమోదం తెలిపింది. 2024 సెప్టెంబర్‌లో జరిగే సమావేశంలో ఈ విధానంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానం అమలుతో మార్కెట్‌లో పారదర్శకత పెరుగుతుంది. బంగారం ధరల్లో వ్యత్యాసం తగ్గడం వల్ల దాని రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటు బంగారంపై ఇష్టానుసారంగా ధరలు వసూలు చేసే ధోరణికి అడ్డుకట్ట పడనుంది.
ప్రయోజనాలు
'వన్ నేషన్ - వన్ రేట్' విధానం వల్ల వినియోగదారుల్లో విశ్వాసం పెరుగుతుంది. ధరల్లో వ్యత్యాసం లేకపోవడం వల్ల ఎటువంటి అపోహలు లేకుండా పసిడిని కొనుగోలు చేస్తారు. బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. దేశంలో పసిడి పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుంది.
బంగారం ధరలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి?
ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. అయితే రోజువారీగా బంగారం ధర మారుతూ ఉంటుంది. దేశంలోని రాష్ట్రాల్లో ఒక్కో ధర ఉంటుంది. ప్రతి నగరంలో స్థానిక మార్కెట్ పరిస్థితులే ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. బంగారం డిమాండ్, సరఫరా సహా మరికొన్ని విషయాలు పసిడి ధరను నిర్ణయిస్తాయి. అవేంటంటే?
- రవాణా ఖర్చులు : భారత్ ఇతర దేశాల నుంచి ప్రధానంగా దిగుమతి చేసుకున్నవాటిలో బంగారం ఒకటి. బంగారం భారత్‌లోని పలు రాష్ట్రాలకు రవాణా అవుతుంది. దూరాన్ని బట్టి కూడా బంగారం రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఇది కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతుంది.
- బంగారం రకం : బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. సాధారణంగా పసిడి 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లలో లభిస్తుంది. ఇందులో 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనది. అలాగే ఖరీదైనది కూడా.
- స్థానిక జ్యువెల్లరీ సంఘాలు : స్థానిక జ్యువెల్లరీ సంఘాలు వాటి పరిధిలో బంగారం ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
- బంగారం నాణ్యత : పసిడి ధరలను ప్రభావితం చేసే మరో అంశం బంగారం నాణ్యత. నాణ్యతను బట్టి బంగారం ధర ఉంటుంది.
- మార్కెట్ పరిస్థితులను బట్టి :నిజానికి ఒక్కో దేశంలో బంగారం ధర ఒక్కో రకంగా ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. పసిడికి డిమాండ్ ఎక్కువగా ఉంటే దాని ధర అమాంతం పెరుగుతుంది. డిమాండ్ తక్కువ ఉంటే పసిడి ధర తగ్గుతుంది.
- కస్టమ్స్ డ్యూటీ, సుంకాలు: బంగారం దిగుమతిపై భారత ప్రభుత్వం విధించే కస్టమ్స్ డ్యూటీ, సుంకాలు కూడా దాని ధరను ప్రభావితం చేస్తాయి. దిగుమతి సుంకాలను బట్టి పసిడి ధర ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో బంగారంపై దిగుమతి సుంకం 10 శాతం, పన్ను 3 శాతం ఉంటుంది.