Nvidia Employees Late Night Work :ఎన్విడియా- మూడు ట్రిలియన్ డాలర్ల కంపెనీ. ఇందులో పనిచేసే ఉద్యోగులంతా కోటీశ్వరులే! రిటైర్ అయి శేషజీవితం సునాయాసంగా గడిపే అంత సంపద!! ఇవన్నీ ఉన్నా ఆ కంపెనీ ఉద్యోగులు వారానికి ఏడు రోజుల పాటు, నిత్యం రాత్రి 2.00 గంటల వరకు పనిచేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో మీటింగులకు హాజరవుతూ, బాస్‌లు పెట్టే చివాట్లు భరిస్తున్నారు. పని ప్రదేశంలో పరిస్థితులు అనుకూలంగా లేకున్నా, ఆ సంస్థను మాత్రం వీడటం లేదు ఉద్యోగులు. వీరంతా ఎందుకిలా చేస్తున్నారు? ఇబ్బంది ఉన్నా ఆ కంపెనీ నుంచి ఎందుకు బయటకు వెళ్లడం లేదు? అనే వివరాలతో బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ ఓ కథనం ప్రచురించింది. అందులో కొందరు ఉద్యోగులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఎన్విడియాలో ఉద్యోగ వాతావరణం ప్రెషర్ కుక్కర్‌లా ఉంటుందని తెలిపారు.
'ప్రెషర్ కుక్కర్లో పనిచేస్తున్నాం!'
బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం- ఎన్విడియాలో ఉన్న సుదీర్ఘ పనిగంటలు, మీటింగ్‌ల్లో ఉద్యోగులకు మేనేజర్లు చివాట్లు పెట్టడం, వాగ్వాదాలు ఉంటాయని కొందమంది సంస్థ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు వెల్లడించారు. ఇంతకుముందు ఎన్విడియాలో టెక్ సపోర్ట్ రోల్లో పని చేసిన ఓ వ్యక్తి, తాను వీకెండ్స్‌తో సహా ప్రతిరోజు రాత్రి 1-2 గంటల వరకు పనిచేసేవాడినని చెప్పాడు. ఇక తన ఇంజినీర్ సహోద్యోగులు ఇంకా ఎక్కువ సేపు పనిచేసేవారని వెల్లడించాడు. మరికొందరు ఉద్యోగులు మాట్లాడుతూ, తాము ప్రతిరోజు కనీసం 7 మీటింగ్‌లకు హాజరయ్యేవారమని తెలిపారు. అంతేకాకుండా నిబంధనల కంటే తక్కువ సమయం పని చేసిన ఉద్యోగులను కంపెనీ-వైడ్ మీటింగ్‌లకు పిలిచేవారట.