Nvidia AI Summit 2024 :కృత్రిమ మేధ(ఏఐ) ఉద్యోగాలను హరించుకుపోదని, కానీ ఆ సాంకేతికతను ఉపయోగించి ఓ వ్యక్తి మెరుగ్గా పని చేస్తే మిగిలిన వారు ఆ అవకాశాన్ని కోల్పోతారని ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ అన్నారు. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఎన్విడియా ఏఐ సమిట్- 2024 ఈ వ్యాఖ్యలు చేశారు. సాఫ్ట్‌వేర్‌ను ఎగుమతి చేస్తున్న భారతదేశం భవిష్యత్‌లో ఏఐను సరఫరా చేస్తుందని పేర్కొన్నారు.
'భారత్- కంప్యూటర్ రంగంలో ప్రపంచానికి సుపరిచితం. భారత్ త్వరలో ప్రభావవంతమైన ఏఐ సొల్యూషన్స్‌ను ఎగుమతి చేయనుంది. ప్రస్తుతం ఇండియా సాఫ్ట్వేర్ ఎగుమతులు కేంద్రంగా ఉంది. భవిష్యత్‌లో ఏఐ అభివృద్ధి, ఎగుమతి చేసే పవర్‌హౌస్‌గా మారునుంది. భవిష్యత్‌లో ప్రతి వ్యక్తికి ఓ సొంత ఏఐ కోపైలట్లు ఉండనున్నాయి. 2024లో భారత్ కంప్యూటర్ సామర్థ్యాల్లో 20 శాతం వృద్ధిని సాధిస్తుంది. భారత దేశంలో మా ఎకోసిస్టమ్ విస్తరించేందుకు చూస్తున్నాం. ఇక ఏఐ పూర్తిగా ఉద్యోగాలను హరించుకుపోదు. కానీ ఏఐను ఉపయోగించి మెరుగ్గా పని చేసే వ్యక్తి వల్ల ఉద్యోగం పోతుంది' అని జెన్సన్ హువాంగ్ అన్నారు.
ఎన్విడియాలో మూడోవంతు భారతీయులే
భారత్‌లో ఏఐ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఓ ఇన్నోవేషన్ సెంటర్‌ను నిర్మించడానికి రిలయన్స్‌తో ఎన్విడియా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు జెన్స్న్ హువాంగ్ ప్రకటించారు. సమ్మిట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీతో భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే చిప్‌ల తయారీలో భారత్ ప్రపంచ దేశాల సరసన ఉందని పేర్కొన్నారు. ఎన్విడియాలో మూడోవంతు కంటే ఎక్కువ మంది భారతీయలు ఉండొచ్చని పేర్కొన్నారు. ఆరేళ్ల కిందటే తన క్యాబినెట్లో ఏఐ గురించి ప్రసంగించమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడిగినట్లు తెలిపారు. అలా తనను ఏఐ గురించి చెప్పమని పిలిచిన మొదటి వ్యక్తి మోదీ అని చెప్పారు.
ప్రపంచానికే భారత్ ఏఐ సేవలు
భవిష్యత్‌లో ఏఐతో భారత్ సాధించిన విజయాలు చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుందని ముకేశ్ అంబానీ అన్నారు. ఏఐ వంటి టెక్నాలజీలు, ప్రజల ఆకాంక్షలు భారత ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయని చెప్పారు. ప్రపంచానికి భారత్ కేవలం సీఈఓలను మాత్రమే కాకుండా, ఏఐ సేవలను కూడా అందజేస్తుందని పేర్కొన్నారు. అమెరికా, చైనా తర్వాత పెద్ద డిజిటల్ కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారత్ కలిగి ఉందని ముకేశ్ తెలిపారు.