Health Insurance New Rules 2024 : మనకు 'జీవిత బీమా' ఎంత ముఖ్యమో, 'ఆరోగ్య బీమా' కూడా అంతే ముఖ్యం. ఆరోగ్య బీమా అనేది మనం చేయించుకునే వివిధ వైద్య, శస్త్ర చికిత్సల ఖర్చులను కవర్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం పేమెంట్ చేసి రీయింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఆరోగ్య బీమా కంపెనీయే నేరుగా వైద్యసంస్థకు పేమెంట్ చేస్తుంది. అయితే ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించిన పలు రూల్స్‌ను బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఇటీవల మార్చింది. ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం.
పీఈడీ వెయిటింగ్ పీరియడ్ మూడేళ్లే!
హెల్త్ ఇన్సూరెన్స్క్లెయిములకు సంబంధించిన పలు నిబంధనలను ఐఆర్‌డీఏఐ సవరించింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్ (PED), మారటోరియం పీరియడ్‌లను తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల ఆరోగ్య బీమా పాలసీని తీసుకునే వారికి మరింత ప్రయోజనం కలుగనుంది. పాలసీని తీసుకునే టైంలో పాలసీ తీసుకుంటున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వివరాలను తొలుత తెలుసుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ప్రారంభం కావడానికి కొంతకాలం వెయింటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ ఈలోపే ఏవైనా అనారోగ్య సమస్యలు (పీఈడీ) తలెత్తి బీమా తీసుకున్న వ్యక్తి ఆస్పత్రి పాలైతే ఎలాంటి కవరేజీ లభించదు. దీన్నే పీఈడీ వెయిటింగ్ పీరియడ్ అని పిలుస్తుంటారు. ఇంతకుముందు నాలుగేళ్లుగా ఉన్న 'పీఈడీ వెయిటింగ్ పీరియడ్'ను ఇప్పుడు 3 సంవత్సరాలకు ఐఆర్‌డీఏఐ తగ్గించింది. దీనివల్ల బీమా పాలసీ తీసుకునేవారికి ప్రయోజనం కలుగుతుంది. అయితే విదేశీ ప్రయాణ పాలసీలు తీసుకునే వారికి ఈ రూల్ వర్తించదని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది.