IT Penalties On Cash Transaction : మన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కంటే నగదు లావాదేవీలే భారీగా జరుగుతున్నాయి. అందుకే ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపునకు మళ్లించడానికి ఆదాయ పన్ను శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై కొన్ని ఆంక్షలు విధించింది. అంతేకాదు కొన్ని ట్రాన్సాక్షన్స్‌పై ఏకంగా 100 శాతం వరకు పెనాల్టీ విధిస్తోంది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ST సహా మరికొన్ని సెక్షన్ల కింద నగదు లావాదేవీలు పరిమితికి మించి చేస్తే నోటీసులతో పాటు పెనాల్టీ పడే అవకాశం ఉంది. 2025-26 సంవత్సరానికి సంబంధించి జులై 31లోగా ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే 100 శాతం వరకు పెనాల్టీ పడే ట్రాన్సాక్షన్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
లోన్స్, డిపాజిట్స్, అడ్వాన్సులు ( సెక్షన్ 269SS) :లోన్స్, డిపాజిట్స్, అడ్వాన్స్‌లు ఇవ్వడం లాంటి వాటి కోసం రూ.20,000 కంటే ఎక్కువ నగదును ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే సెక్షన్ 269SS కింద అంతే మొత్తం పెనాల్టీ పడుతుంది.
రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకుంటే ( సెక్షన్ 269ST ) :ఒక రోజులో రూ.2 లక్షలకు మించి నగదును తీసుకోవడానికి వీల్లేదు. సెక్షన్ 269ST ప్రకారం రూ.2 లక్షలకు మించి నగదును తీసుకుంటే అంతే మొత్తంలో జరిమానా పడుతుంది.
లోన్ అండ్ డిపాజిట్స్ రీపేమెంట్ (సెక్షన్ 269T) : లోన్లు, డిపాజిట్లు కింద తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించేటప్పుడు రూ.20 వేలు వరకే నగదు రూపంలో పే చేయవచ్చు. అంతకు మించి చేస్తే సెక్షన్ 269T ప్రకారం 100శాతం పెనాల్టీ పడే అవకాశం ఉంది.