Motor Insurance Add-on Benefits :వాహన బీమా అనేది రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ మోటారు బీమాకు జతచేసుకునే యాడ్-ఆన్స్ గురించి, అవి అందించే ప్రయోజనాల గురించి చాలా మందికి అవగాహన లేదనే చెప్పాలి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా వాహనం దొంగిలించబడినా, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు ఏర్పడినా, పరిహారం రావాలంటే కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. దీనికి తోడు కొన్ని యాడ్-ఆన్లు కూడా జతచేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రౌండ్-ది-క్లాక్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవరేజ్
వెహికల్ బ్రేక్‌డౌన్, ఫ్లాట్ టైర్, ఇంజన్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు, పెట్రోల్ అయిపోయినపుడు, వాహనం రిపేర్‌కి వచ్చినపుడు పాలసీదారులకు ఈ రౌండ్-ది-క్లాక్ యాడ్-ఆన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ యాడ్-ఆన్ టోయింగ్ సేవలు, ఆన్-సైట్ మరమ్మతులు, అత్యవసర ఇంధనం అందించి మీ సమస్యను పరిష్కారం కావడానికి తగిన సహాయాన్ని అందిస్తుంది.
ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్
ఇంజిన్ అనేది వాహనంలోని అత్యంత ముఖ్యమైన, ఖరీదైన భాగం. దీనికి ఏదైనా రిపేర్ వస్తే బాగుచేయించడానికి భారీగా ఖర్చువుతుంది. కాబట్టి ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్‌ను పాలసీలో చేర్చుకోవడం ఉత్తమం. దీని వల్ల ఇంజిన్ పనిచేయకపోవడం, లూబ్రికేటింగ్ ఆయిల్ లీకేజీ, ఇంజిన్లోకి నీళ్లు చేరడం, హైడ్రోస్టాటిక్ లాక్ మొదలైన సమస్యల వల్ల ఏర్పడిన నష్టాలకు పరిహారం లభిస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వాహన యజమానులకు ఈ యాడ్-ఆన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
జీరో-డిప్రిషియేషన్ కవర్
వాహనం పాతబడుతున్న కొలదీ దాని విలువ తగ్గుపోతుంటుంది. అలాగే వాహనంపై గీతలు, చొట్టలు పడినా దాని విలువ పడిపోతుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) వాహనం ప్రామాణిక తరుగుదల రేటును లెక్కిస్తుంది. దీనిని ఆధారంగా చేసుకుని బీమా కంపెనీలు క్లెయిమ్ సమయంలో చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయిస్తాయి. అయితే జీరో-డిప్రిసియేషన్ (దీనిని బంపర్-టు-బంపర్ కవర్ లేదా నిల్-డిప్రిసియేషన్ కవర్ అని కూడా పిలుస్తారు) యాడ్-ఆన్‌ను తీసుకుంటే, వాహనం ప్రస్తుత విలువతో సంబంధం లేకుండా దాని పూర్తి విలువను పొందవచ్చు.
ఉదాహరణకు, ఐదేళ్ల పాత వాహనం విషయంలో, బీమా కంపెనీలు 50 శాతం తరుగుదల రేటును వర్తింపజేస్తాయి. అప్పుడు సగటు క్లెయిమ్ రూ.30,000 - రూ.40,000 వరకు వస్తుందనుకుంటే, ఇన్సూరెన్స్ కంపెనీ ఈ మొత్తంలో సగం మాత్రమే కవర్ చేస్తుంది. మిగిలిన రూ.15,000 - రూ.20,000 నష్టాన్ని పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. అదే అతను జీరో-డిప్రిషియేన్ కవర్‌ను తీసుకుని ఉంటే, కచ్చితంగా అతనికి పూర్తి పరిహారం లభించేది.