తెలంగాణ

telangana

ETV Bharat / business

పెళ్లికి ముందే కాబోయే భాగస్వామితో వీటి గురించి చర్చించండి- అప్పుడే 'హ్యాపీ మ్యారీడ్ లైఫ్'! - MARRIAGE FINANCIAL PLANNING

మీకు కాబోయే జీవిత భాగస్వామితో ఈ ఆర్థిక విషయాలు ముందే చర్చించండి!

Marriage Financial Planning
Marriage Financial Planning (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2024, 1:39 PM IST

Marriage Financial Planning :పెళ్లి చేసుకోబోయే ఇద్దరికీ ఒకరికొకరు నచ్చడమేకాదు, అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం అవసరం. అన్ని అంశాల్లోనూ సాధ్యం కాకపోతే, కొన్ని ప్రధానమైన విషయాల్లోనైనా ఇద్దరూ ఒకేమాట మీద ఉండాలి. అప్పుడే పెళ్లి తర్వాత అభిప్రాయభేదాలు రాకుండా సంతోషంగా ఉంటారు. అయితే, ఈ మధ్య విడిపోతున్న జంటల్ని గమనిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి కాబోయే జీవిత భాగస్వామితో కొన్ని ఆర్థికపరమైన విషయాలు ముందే చర్చిస్తే మేలు. ఆ ఆర్థికపరమైన అంశాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆర్థిక విషయాలపై మాట్లాడుకోండి
కాబోయే జీవిత భాగస్వామితో మీ ఆర్థిక విషయాల గురించి నిజాయితీగా మాట్లాడండి. మీ ఆదాయం, పొదుపు, అప్పులు, ఆర్థిక లక్ష్యాలు, ఖర్చుల గురించి చర్చించండి. ఇలా చేయడం వల్ల కాబోయే దంపతుల ఆర్థిక నేపథ్యం తెలుస్తుంది. అలాగే పరస్పర ఆర్థిక ప్రాధాన్యతలను తెలియజేయడానికి వీలవుతుంది. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది.

ఆర్థిక లక్ష్యాలు
కాబోయే దంపతులు స్వల్ప లేదా దీర్ఘకాలిక లక్ష్యాలపై చర్చించుకోవాలి. ఇల్లు కొనడం, పెట్టుబడులు పెట్టడం లాంటివే కాకుండా, కుటుంబ ప్రణాళికల గురించి కూడా చర్చించుకోవాలి. పిల్లలు పుట్టిన తర్వాత వారి పెంపకం, చదువుల కోసం డబ్బు పొదుపు గురించి మాట్లాడుకోవాలి. వ్యక్తిగత, ఉమ్మడి లక్ష్యాల గురించి చర్చించుకోవడం కూడా మంచిది.

పెళ్లి, హనీమూన్ ఖర్చులు
పెళ్లి ఖర్చులు, హనీమూన్ కోసం కొంత బడ్జెట్​ను పక్కకు తీయాలి. పెళ్లికి పెట్టబోయే ఖర్చుపై కాబోయే దంపతులిద్దరూ చర్చించుకోవాలి. తదనుగుణంగా మీ ఆర్థిక ప్రణాళికలను ప్లాన్ చేయండి. తక్కువ ఖర్చుతో మ్యారేజ్ చేసుకోవడం బెటర్. పెళ్లి కోసం అప్పులు చేయకుండా ఉండడం మంచిది.

ఖర్చులలోనూ భాగస్వామ్యం
కాబోయే దంపతులిద్దరూ ఉద్యోగులైతే ఇంటి అద్దె, కిరాణా సామగ్రి, ఇతర ఖర్చులను ఇద్దరు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఖర్చులను సమానంగా విభజించుకుంటారు. మరికొందరు వ్యక్తిగత ఆదాయం ఆధారంగా ఖర్చు చేస్తుంటారు. ఈ విషయాలపై కాబోయే జంట చర్చించుకుంటే మంచిది.

అత్యవసర నిధి
వైద్యం, ఉద్యోగం పోయినప్పుడు అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థిక భద్రతను అందిస్తుంది. 3-6 నెలలకు సరిపడా డబ్బులను ఆదా చేయడం మంచిది. భాగస్వామ్య అత్యవసర నిధిని ప్రారంభించడం వల్ల మీరు కష్ట సమయాల్లో లోన్​లు, అప్పులపై ఆధారపడక్కర్లేదు. ఇలాంటి విషయాలపై కూడా కాబోయే జంట చర్చించుకోవాలి.

ఆడంబరాలు వద్దు
మీ దగ్గర డబ్బులు లేనప్పుడు పెళ్లి విషయంలో ఆడంబరాలను పోవద్దు. వీలైనంత వరకు తక్కువ ఖర్చుతోనే మ్యారేజ్ చేసుకోండి. అప్పు తీసుకుని పెళ్లి చేసుకునేటప్పుడు అది మీ స్తోమతకు మించిపోకుండా చూసుకోండి. ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్స్, క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్స్ వంటి అప్పులను తీర్చేయండి. ముందుగా అధిక వడ్డీ రేటు ఉన్న అప్పులను కట్టేయండి.

ఆరోగ్య బీమా పాలసీ
అలాగే ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పాలసీ అవసరం. అత్యవసర సమయాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి కూడా కాబోయే దంపతులు చర్చించుకోవాలి.

ఉమ్మడిగా పెట్టుబడులు
దంపతులిద్దరూ కలిసి పెట్టుబడులు పెట్టడం వల్ల బలమైన ఆర్థిక భవిష్యత్తు ఉంటుంది. పొదుపు ఖాతాలు, ఫిక్స్​డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, స్టాక్స్​లలో పెట్టుబడులు పెట్టడంపై చర్చించుకోండి. జాయింట్ ఇన్వెస్ట్​మెంట్ ఖాతాను ఓపెన్ చేయండి. అలాగే ఏవైనా ఆస్తులను కొనుగోలు చేయవచ్చు.

పొదుపుపై చర్చలు
ఖర్చు, పొదుపుపై ఎక్కువగా చర్చించుకోండి. మీ దీర్ఘకాల, వ్యక్తిగత లక్ష్యాల కోసం నెలవారీగా ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారో చర్చించుకోండి.

వీలునామా
అలాగే ఎస్టేట్ ప్లానింగ్ అనేది కూడా ముఖ్యమే. కానీ దీన్నీ చాలా మంది పట్టించుకోరు. పెళ్లైన తర్వాత వీలునామాను రాయడం వల్ల ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే మీ ఆస్తులు మీరు అనుకున్నవారికి సురక్షితంగా దక్కుతాయి. ఈ విషయంపైనే ముందే చర్చించుకోవడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details