Life Insurance Tax Benefits : ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారు బీమా పాలసీల వైపే చూస్తారు. పన్ను ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం కావడం వల్ల బీమా సంస్థలూ ఇప్పుడు పలు కొత్త పాలసీలను తీసుకొస్తున్నాయి. అయితే వీటిని కేవలం పన్ను ఆదా కోసమే తీసుకోకూడదు. కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే పాలసీలను మాత్రమే ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
పాత ఆదాయపు పన్ను విధానం ఎంచుకున్నవారు సెక్షన్ 80సీ ప్రకారం, రూ.1,50,000 వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇందులో జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియం కూడా ఉంటుంది. అందుకే చాలా మంది జీవిత బీమా పాలసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఆర్థిక రక్షణ కోసమే
అనుకోని కష్టం వచ్చినప్పుడు కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించడమే జీవిత బీమా ప్రథమ లక్ష్యం. పన్ను ప్రయోజనం కోసం మాత్రమే ఈ పాలసీని ఎంచుకున్న వారు ఎక్కువ ప్రీమియం పాలసీలను కొనుగోలు చేస్తుంటారు. దీనివల్ల మీ పన్ను ఆదా అవుతుంది. కానీ, కుటుంబానికి అవసరమైన రక్షణ మాత్రం లభించకపోవచ్చు.
కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా
ముందుగా మీకు ఎంత మొత్తానికి బీమా అవసరమో తెలుసుకోవాలి. మీ ఆదాయం, జీవన శైలి, బాధ్యతలు, అప్పులు అన్నీ లెక్కించుకొని ఎంత విలువైన పాలసీని తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు మీ పిల్లల వయసు అయిదేళ్లు అనుకుందాం. రానున్న 18 ఏళ్లపాటు మీపై ఆధారపడి ఉంటారు. అంటే 18 ఏళ్లపాటు పిల్లల అవసరాలను తీర్చే మొత్తంతో బీమా పాలసీని తీసుకోవాలి. మీ వార్షికాదాయం కంటే 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఉండటం మంచిది. అంతేకానీ, కేవలం పన్ను ఆదా కోసం చూసుకుని, తక్కువ మొత్తం పాలసీని తీసుకోవడం వల్ల కుటుంబానికి ఏ మాత్రం ప్రయోజనం ఉండదు.
కొత్తగా తీసుకుంటుంటే
ఇప్పటి వరకు బీమా పాలసీ తీసుకోని వారు ఉంటే టర్మ్ పాలసీకి ప్రాధాన్యం ఇవ్వటం బెటర్. దీని వల్ల తక్కువ ప్రీమియానికి, అధిక రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా పన్ను ఆదాకూ ఉపయోగపడుతుంది. పాలసీని ఏటా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. సాధారణ టర్మ్ పాలసీలను తీసుకుంటే గడువు తీరిన తర్వాత ఎలాంటి మొత్తమూ వెనక్కి రాదు. ఇప్పుడు కొత్తగా కొన్ని టర్మ్ పాలసీలు ప్రీమియం వెనక్కి ఇస్తామని చెబుతున్నాయి. కాకపోతే వీటికి కాస్త అధిక ప్రీమియం ఉంటుంది. వీటికి బదులు సాధారణ టర్మ్ పాలసీలను ఎంచుకునే ప్రయత్నం చేయొచ్చు. మారుతున్న అవసరాలను బట్టి, పాలసీ విలువనూ పెంచుకునే ప్రయత్నం చేస్తే మంచిది.