LIC New Index Plus Plan Details : ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ కొత్తగా 'ఇండెక్స్ ప్లస్ ప్లాన్'ను ప్రవేశపెట్టింది. ఇది క్రమం తప్పకుండా చెల్లింపులు చేయడానికి ఇష్టపడే వారికోసం రూపొందించిన కొత్త పెట్టుబడి అవకాశం. ఇండెక్స్ ప్లస్ ప్లాన్ రెండు రకాల ప్రయోజనాలను అందిస్తుందని ఎల్ఐసీ తెలియజేస్తుంది. మొదటిది జీవిత బీమా కవరేజీని అందించడం, రెండవది పాలసీ గడువు వరకు పొదుపు చేసే అవకాశం కల్పించడం.
ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ ప్లాన్ ఎలిజిబిలిటీ :
బీమా పథకంలో చేరాలనుకునే వారి వయసు కనిష్ఠంగా 90 రోజులు, గరిష్టంగా 60 సంవత్సరాలలోపు ఉండాలి. ఒక వేళ మీ వయసు 90 రోజుల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే, మీ వార్షిక ప్రీమియానికి 7 నుంచి 10 రేట్లు వరకు బేసిక్ సమ్ అస్యూర్డ్ లభిస్తుంది. ఒకవేళ మీ వయసు 51 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటే, మీకు లభించే బేసిక్ సమ్ అస్యూర్డ్ మీ వార్షిక ప్రీమియానికి 7 రెట్లు ఉంటుంది.
ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ ప్లాన్ ప్రీమియం :
ఈ ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ పాలసీలో మీకు నచ్చిన కాలవ్యవధుల్లో ప్రీమియం చెల్లించవచ్చు. అంటే నెల, 3 నెలలు, 6 నెలలు, ఒక సంవత్సర కాల వ్యవధుల్లో ప్రీమియం చెల్లించవచ్చు. ఒక వ్యక్తి సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించాలని అనుకుంటే, కనిష్ఠంగా ఏటా రూ.30,000 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే ఆరు నెలలకు రూ.15,000, మూడు నెలలకు రూ.7,500 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ చెల్లింపులను ఎంచుకుంటే నెలకు రూ.2,500 చొప్పున చెల్లించాలి. గరిష్ఠ ప్రీమియంపై ఎలాంటి పరిమితిలు లేవు.