Is Buying Silver A Good Investment : బంగారంతో వెండి పోటీపడుతోంది. కిలో వెండి ధర రూ.1 లక్షకు చేరువవుతుందనే వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వెండి ధరలు కాస్త స్థిరంగా కొనసాగుతున్నాయి. 2023లో వెండి 7.19 శాతం పెరిగింది. ఈ ఏడాది ఇది రూ.86,300 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. కొన్ని బ్రోకరేజీ సంస్థలు కిలో వెండి ధర మధ్యస్థ కాలంలో రూ.1 లక్ష నుంచి రూ.1.2 లక్షల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నాయి. 2017లో కిలో వెండి సగటు ధర రూ.37,825గా ఉంటే 2023లో ఇది రూ.78,600లకు చేరింది. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతోపాటు ఇతర ఆర్థిక కారణాల వల్ల బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఊహాజనిత కొనుగోళ్లు, పారిశ్రామిక అవసరాలు పెరుగుతుండటంతోనూ వెండి ధర పెరుగుతోంది. చారిత్రాత్మకంగానూ పసిడితోపాటు వెండి ధరలు కూడా సహజంగా పెరుగుతున్నాయి. అందుకే దీర్ఘకాలిక దృష్టితో వెండిలో మదుపు చేయడం మంచిదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
How To Invest In Silver :వెండిని పలు రూపాయాల్లో కొనుగోలు చేయవచ్చు. నేరుగా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కడ్డీలు, నాణేల రూపంలో తీసుకోవచ్చు. వెండితో రూపొందించిన పలు వస్తువులు, ఆభరణాలు కూడా ఉంటాయి. వీటిలో ఏది మీకు అనుకూలమో నిర్ణయించుకోవాలి. అయితే ఓ విషయం గుర్తుంచుకోవాలి. కడ్డీలు, నాణేల రూపంలో తీసుకున్నప్పుడు ఖర్చులు తక్కువగా ఉంటాయి. వస్తువులు, ఆభరణాల రూపంలో తీసుకున్నప్పుడు తయారీ రుసుములు, తరుగు లాంటివి కూడా ఉంటాయి.
Silver ETF : ఒక వేళ మీరు డిజిటల్ రూపంలోనే పొదుపు చేయాలనుకుంటే, వెండి ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. డీమ్యాట్ అకౌంట్ ద్వారా మీరు వెండిని కొనుగోలు చేయవచ్చు. ఇవి షేర్ల మాదిరిగానే పనిచేస్తాయి. వెండి ఈటీఎఫ్‌లు మదుపరులకు అనుకూలమైన, సురక్షితమైన పెట్టుబడి మార్గంగా ఉంటాయి. అయితే వెండి ధరలు మారుతున్నప్పుడు, యూనిట్ ధరల్లోనూ హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.
వెండి ధరను దగ్గరగా అనుసరించడానికి కొన్ని ఈటీఎఫ్‌లు నేరుగా సిల్వర్‌ను కొనుగోలు చేసి పెట్టుకుంటాయి. కొన్ని ఈటీఎఫ్‌లు వెండి గనులను నిర్వహించే సంస్థల షేర్లలోనూ మదుపు చేస్తాయి. వీటిని దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలుగానే చూడాలంటున్నారు నిపుణులు. స్వల్పకాలంలో వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. ముఖ్యంగా చైనా, అమెరికా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం ఏర్పడినప్పుడు, వీటి ధరలపై ప్రభావం పడుతుంది. నేడు గ్రీన్ ఎనర్జీ, విద్యుత్ వాహనాల్లో వెండి వినియోగం బాగా పెరుగుతోంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడులకు బాగా అనుకూలమైన విషయమని చెప్పవచ్చు.