Life Insurance Rules :'జీవిత బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో, ఎలాంటి విచారణ అవసరం లేకపోతే, క్లెయిం దరఖాస్తు అందిన 15 రోజుల్లోగా బీమా సంస్థ పరిహారం చెల్లించాలి. విచారణ అవసరమైన సందర్భాల్లో 45 రోజుల్లోగా క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేయాలి' అని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) స్పష్టం చేసింది. పాలసీని స్వాధీనం చేసినప్పుడు 7 రోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. గడువు తీరిన పాలసీలకు వ్యవధి తీరిన రోజునే పేమెంట్ పూర్తి చేయాలని మాస్టర్ సర్క్యులర్ జారీ చేసింది.
నచ్చకపోతే పాలసీ వాపస్
ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు తీసుకున్న వ్యక్తులకు పత్రాలు అందిన 30 రోజుల వరకు ‘ఫ్రీ లుక్ పీరియడ్’ నిబంధన వర్తిస్తుంది. పాలసీల నిబంధనలు మీకు నచ్చకపోతే, ఈ గడువులోపు పాలసీని వెనక్కి ఇచ్చేయవచ్చు. దీనికి ఎలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించకపోతే అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
- కొత్త పాలసీలు ఇచ్చేటప్పుడు బీమా సంస్థలు, తమకు అవసరమైన అదనపు పత్రాలను 7 రోజుల్లోగా అడగాలి. 15 రోజుల్లోగా పాలసీ పత్రాలను ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి అందించాలి.
- బీమా పాలసీ దరఖాస్తుతో పాటే ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. దరఖాస్తును ఆమోదించిన తర్వాత, ప్రీమియం చెల్లించేందుకు వీలు కల్పించింది. అయితే ప్రీమియం చెల్లించిన వెంటనే రక్షణ ప్రారంభమయ్యే పాలసీలకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.
- బీమా పాలసీలను విక్రయించే వారి గురించి తెలుసుకునేందుకు వీలుగా, సంస్థలు తమ వెబ్‌సైట్లలో 'సెర్చ్ టూల్'ను ఏర్పాటు చేయాలి.
- జీవిత బీమా పాలసీ తీసుకున్నప్పుడు పాలసీదారులకు 'ఫ్రీ లుక్ వ్యవధి' గురించిన సమాచారం, బీమా పత్రం, దరఖాస్తు చేసిన సమయంలో భర్తీ చేసిన ప్రతిపాదన, పాలసీ ప్రయోజనాలతో కూడిన వివరాలను అందించాలి.
- కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్)ను తప్పనిసరిగా పాలసీదారులకు ఇవ్వాలి. ఇందులో పాలసీ రకం, ఎంతకు పాలసీ తీసుకున్నారు, పాలసీ రక్షణ కల్పించే విధానం, ప్రయోజనాలు, మినహాయింపులు, క్లెయిమ్ ఎలా చేసుకోవాలి, ఫిర్యాదు చేసేందుకు అంబుడ్స్‌మన్ చిరునామా, తదితర అన్ని వివరాలు ఉండాలి.
- ఆరోగ్య బీమా పాలసీలకు కూడా ఇలాంటి సీఐఎస్‌నే అందించాలి. ఇందులో పాలసీ వివరాలతో పాటు, ఉప-పరిమితులు, సహ చెల్లింపులు లాంటి సమాచారం ఉండాలి. వేచి ఉండే వ్యవధి, ఏయే వ్యాధుల చికిత్సకు పరిహారం రాదు అనే వివరాలు కూడా దీనిలో తెలియజేయాలి.