IRDAI Guidelines On Health Insurance :ఆరోగ్య బీమాకు సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఏదైనా ఆస్పత్రిలో క్యాష్‌లెస్ చికిత్స అందుబాటులో ఉందా? లేదా? అనే దానిపై పాలసీదారుడికి గంటలోగా ఆరోగ్యబీమా సంస్థ బదులివ్వాలని ఆదేశించింది. క్యాష్‌లెస్ చికిత్స అందించిన అనంతరం రోగిని డిశ్చార్జి చేసే విషయంపై ఆస్పత్రి నుంచి అభ్యర్థన అందిన మూడు గంటల్లోగా ఆరోగ్య బీమా సంస్థ బదులివ్వాలని సూచించింది. పాలసీదారులకు 100 శాతం క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్లను సకాలంలో పూర్తి చేసేందుకు ఆరోగ్య బీమా సంస్థలు శాయశక్తులా ప్రయత్నించాలని పేర్కొంది. "ఈ మాస్టర్ సర్క్యులర్ విడుదలతో గతంలో మేం జారీ చేసిన దాదాపు 55 సర్క్యులర్లు రద్దయ్యాయి. ఆరోగ్య బీమా పాలసీదారుల సాధికారత లక్ష్యంగా ఇందులో మార్గదర్శకాలు ఉన్నాయి" అని ఐఆర్‌డీఏఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోగ్య బీమా సంస్థలు మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, వేగంగా పాలసీదారులకు సేవలు అందించేలా చేయడమే తమ లక్ష్యమని పేర్కొంది.
ఐఆర్‌డీఏఐ కీలక సూచనలు
- పాలసీలను అందించేటప్పుడే రైడర్లు, అదనపు ప్రయోజనాలు వంటి వివరాలను ఔత్సాహిక వ్యక్తులకు ఆరోగ్య బీమా కంపెనీలు వివరించాలని ఐఆర్‌డీఏఐ సూచించింది.
- పాలసీదారుల స్థోమత, ఆదాయ స్థాయులకు అనుగుణమైన పాలసీల గురించి తెలియజేయాలని చెప్పింది.
- వయసు, ప్రాంతం, ఆరోగ్య స్థితిగతులు, ఆస్పత్రుల లభ్యత వంటి సమాచారాన్ని కూడా పాలసీ తీసుకునే ముందే లబ్ధిదారుడికి స్పష్టంగా చెప్పాలని పేర్కొంది.
- ప్రతి పాలసీ డాక్యుమెంట్‌తో పాటు బీమా సంస్థ తప్పనిసరిగా కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (CIS)ను అందించాలని నిర్దేశించింది. ఇందులో బీమా పాలసీ రకం, బీమా మొత్తం, కవరేజీ వివరాలు, మినహాయింపులు, ఉప పరిమితులు, తగ్గింపులు, వెయిటింగ్ పీరియడ్ వంటి సమాచారాన్ని సులువుగా అర్థమయ్యేలా పొందుపర్చాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది.
- ఒకవేళ లబ్ధిదారుడు పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్‌లు చేసుకోకుంటే బీమా కవరేజీ మొత్తాన్ని పెంచడం ద్వారా, ప్రీమియం మొత్తాన్ని తగ్గించడం ద్వారా, నో క్లెయిమ్ బోనస్‌ను అందించాలని కోరింది.
- పాలసీదారులకు సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు అధునాతన టెక్నాలజీని వినియోగించాలని బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ సూచించింది.
- క్లెయిమ్ సెటిల్‌మెంట్ల కోసం పాలసీదారు నుంచి ఎలాంటి పత్రాలను అడగొద్దని, అవసరమైన అన్ని పత్రాలను ఆస్పత్రుల నుంచే తీసుకోవాలని బీమా సంస్థలు, టీపీఏలకు నిర్దేశించింది.
- ఆరోగ్య బీమా పాలసీని ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ చేసే క్రమంలో నిర్ణీత గడువు నిబంధనను తప్పనిసరిగా అనుసరించాలని తెలిపింది.
- బీమా రంగం అంబుడ్స్‌మన్ జారీ చేసే ఆదేశాలను ఆరోగ్య బీమా కంపెనీ 30 రోజుల్లోగా అమలు చేయకుంటే సదరు పాలసీదారుడికి రోజుకు రూ. 5,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేసింది.
- చికిత్స సమయంలో పాలసీదారుడు మరణిస్తే మృతదేహాన్ని వెంటనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయించాలని ఐఆర్‌డీఏఐ పేర్కొంది.