Investing In Debt Funds : స్టాక్ మార్కెట్‌లో ఒడుదొడుకులు సహజం. అందవల్ల స్వల్పకాలంలో నష్టభయం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది డెట్ పథకాలవైపు మొగ్గు చూపుతారు. అయితే డెట్ ఫండ్స్‌లో కూడా రిస్క్ ఉంటుంది. కనుక డెట్ పథకాలు పూర్తిగా సురక్షితం అనే అపోహలు వీడడం మంచిది. అందుకే డెట్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే ముందు ఇక్కడ తెలిపిన 6 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.
1. మీ లక్ష్యం ఏమిటి?
డెట్ ఫండ్స్ ప్రధానంగా గవర్నమెంట్ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, కార్పొరేట్ బాండ్లు మొదలైన పథకాల్లో మదుపు చేస్తాయి. సాధారణ ఈక్విటీ పథకాలతో పోలిస్తే, వీటి పెట్టుబడి వ్యూహం కాస్త భిన్నంగా ఉంటుంది. కొన్ని ఫండ్లు మూడేళ్ల పరిమితి ఉన్న బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. మరికొన్ని స్వల్పకాలిక పథకాల్లో మదుపు చేస్తాయి. కనుక డెట్ ఫండ్లలో మదుపు చేసే ముందు మీ ఆర్థిక లక్ష్యం, వ్యూహం గురించి కచ్చితంగా ఆలోచించుకోవాలి.
2. వ్యవధి?
డెట్ ఫండ్లు ప్రధానంగా వివిధ వ్యవధులు కలిగిన బాండ్లు, సెక్యూరిటీల్లో మదుపు చేస్తాయి. కొన్ని డెట్ ఫండ్స్ వారం వ్యవధి ఉన్న బాండ్లలోనూ పెట్టుబడులు పెడతాయి. మరికొన్ని మూడేళ్ల వ్యవధి ఉన్న బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక, మీరు ఎంత కాలం పెట్టుబడిని కొనసాగించాలని అనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి. మీరు మదుపు చేయాలనుకుంటున్న డెట్ ఫండ్ వివిధ పథకాల్లో ఎంత వ్యవధి పాటు ఇన్వెస్ట్మెంట్ కొనసాగిస్తుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. దీనివల్ల ఏ స్థాయిలో మీకు రాబడి వస్తుందో ముందుగానే ఒక అంచనాకు రావచ్చు. ఉదాహరణకు ఒక ఫండ్ సగటున మూడేళ్ల వ్యవధి ఉన్న పథకాల్లో మదుపు చేస్తుందని అనుకుందాం. అప్పుడు 2 నుంచి 3 ఏళ్ల వరకు పెట్టుబడిని కొనసాగించాలనుకున్నవారే ఆ డెట్ ఫండ్‌ను ఎంచుకోవాలి.
3. రాబడి మాటేమిటి?
ఇన్వెస్టర్లు గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే, వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, డెట్ ఫండ్ల రాబడి తగ్గుతుంది. వడ్డీ రేట్లు తగ్గితే, డెట్ ఫండ్ల నుంచి కాస్త అధిక రాబడి వస్తుంది. అందుకే వివిధ సందర్భాల్లో డెట్ ఫండ్స్ అందించిన ప్రతిఫలాన్ని బేరీజు వేసుకోవాలి. నిపుణుల ప్రకారం, డెట్ ఫండ్ల నుంచి సగటున 7-9 శాతం వరకు రాబడిని ఆశించవచ్చు.