India's Youngest Millionaire : ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి తన మనవడైన ఏకగ్రహ్ రోహన్ మూర్తికి అక్షరాల రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు. దీనితో ఆ 4 నెలల పసికందు దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్‌గా అవతరించాడు.
ఎక్స్ఛేంజీ ఫైలింగ్ ప్రకారం, నారాయణ మూర్తికి దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌లో 0.40 శాతం వాటా ఉంది. దీనిలోంచి 0.04 శాతం వాటాను (15 లక్షల షేర్లను) తన మనువడైన ఏకగ్రహ్ రోహన్ మూర్తికి బహుమతిగా ఇచ్చారు. 'ఆఫ్-మార్కెట్' విధానంలో ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. దీనితో ఇన్ఫోసిస్‌లో నారాయణ మూర్తి వాటా 0.36 శాతానికి తగ్గింది. అయినప్పటికీ ఆయన చేతిలో ఇంకా 1.51 కోట్ల షేర్లు ఉన్నాయి.
మనవడు పుట్టిన ఆనందంలో!!
నారాయణమూర్తి, సుధామూర్తిలకు రోహన్ మూర్తి అనే కుమారుడు ఉన్నాడు. అతని భార్య అపర్ణా కృష్ణన్ 2023 నవంబర్‌లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ శిశువుకు ఏకగ్రహ్ అనే పేరు పెట్టారు. ఈ సంస్కృత పదానికి 'అచంచలమైన దృష్టి, గొప్ప సంకల్పం' అని అర్థం. ఈ విధంగా సుధ, నారాయణమూర్తి దంపతులు నాన్నమ్మ, తాతయ్యలు అయ్యారు.