Important Things To Know Before Taking Loan :ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం సర్వసాధారణం. వ్యక్తిగత అవసరాల కోసం, ఇల్లు, వాహనాల కోసం చాలా మంది రుణాలు తీసుకుంటారు. ఒకప్పటితో పోలిస్తే, నేడు తేలిగ్గానే బ్యాంక్ లోన్స్ లభిస్తున్నప్పటికీ, కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే!
బ్యాంక్ లోన్స్ తీసుకునే ముందు, దానిని తిరిగి చెల్లించే సామర్థ్యం మీకు ఉందా? లేదా? అనేది అంచనా వేసుకోవాలి. మీ ప్రస్తుత ఆదాయం, దైనందిన ఖర్చులు, అత్యవసర ఖర్చులు, బాధ్యతలు మొదలైన వాటిని ఆధారంగా చేసుకొని, మీరు సకాలంలో రుణాలను తీర్చగలరా? లేదా? అనేది చూసుకోవాలి.
సాధారణంగా మనకు వచ్చే నికర ఆదాయంలో 40-50 శాతం మన దైనందిన, అత్యవసర ఖర్చుల కోసం అయిపోతుంది. ఇలా ఉంటే, మన ఆర్థిక పరిస్థితి బాగున్నట్టే లెక్క. అందువల్ల బ్యాంకులు మన రుణ దరఖాస్తును వేగంగా ఆమోదించే అవకాశాలు ఉంటాయి. కనుక, బ్యాంక్ లోన్ కోసం అప్లై చేసే ముందు, మన ఖర్చులు 40 శాతానికి మించకుండా ఉండేలా చూసుకోవడం మంచిది.
క్రెడిట్ స్కోర్ పెంచుకోవాల్సిందే!
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్స్ ఇచ్చే ముందు, రుణగ్రహీత క్రెడిట్ స్కోరును కచ్చితంగా చూస్తాయి. ముఖ్యంగా మీ క్రెడిట్ రిపోర్టులోని క్రెడిట్ స్కోరు, ఇప్పటికే కొనసాగుతున్న రుణ ఖాతాలు, పొదుపు ఖాతాలు, సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తున్నారా? లేదా? అనే విషయాలను పరిశీలిస్తాయి. ఒక వేళ మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే, రుణాలు మంజూరు చేయడానికి ఇష్టపడవు. అందువల్ల బ్యాంక్ లోన్‌కు అప్లై చేసేముందు, మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోవడం మంచిది.
నేడు చాలా సంస్థలు ఉచితంగా నెలవారీ క్రెడిట్ రిపోర్టును అందిస్తున్నాయి. ఒక వేళ మీకు క్రెడిట్ హిస్టరీ లేకపోతే, కొత్త క్రెడిట్ కార్డు తీసుకుని, దాన్ని నిర్మించుకోవచ్చు. కనీసం రెండు, మూడేళ్లపాటు క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లిస్తూ ఉంటే, మంచి క్రెడిట్ స్కోర్ సాధించడానికి వీలవుతుంది. సాధారణంగా క్రెడిట్ స్కోర్ 750 పాయింట్లు కంటే ఎక్కువ ఉంటే, సులువుగా రుణాలు లభించే వీలుంటుంది