IDFC First Bank CEO Vaidyanathan : ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ వీ.వైద్యనాథన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తనకు ఏమాత్రం సంబంధం లేని ఐదుగురు వ్యక్తులకు 7 లక్షల షేర్లను కానుక (గిఫ్ట్)గా ఇచ్చారు. గతంలోనూ ఆయన, తన శిక్షకునికి, మరణించిన సహోద్యోగుల బంధువులకు, ఇంట్లో పనిచేసే వాళ్లకు, డ్రైవర్‌కు లక్షల షేర్లను కానుకగా ఇచ్చేశారు.
కానుకగా 7 లక్షల షేర్లు!
మార్చి 21 స్టాక్ ఎక్స్ఛేంజి ఫైలింగ్ ప్రకారం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ వీ.వైద్యనాథన్ ఐదుగురు వ్యక్తులకు 7 లక్షల షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. లబ్ధిదారుల్లో సమీర్ మహాత్రేకు 50,000 షేర్లు; మయాంక్ ఘోష్‌కు 75,000 షేర్లు; సంపత్ కుమార్‌కు 2.5 లక్షల షేర్లు; ఏ.కనోజియాకు 2.75 లక్షల షేర్లు; మనోజ్ సహాయ్‌కు 50,000 షేర్లు కానుకగా ఇచ్చారు. ఎందుకంటే?
- సమీర్ మహాత్రే సొంత ఇంటి కలను నిజం చేసేందుకు వైద్యనాథన్ అతనికి 50 వేల షేర్లను కానుకగా ఇచ్చారు.
- తన సహోద్యోగి మరణించిన కారణంగా, అతని బంధువైన మయాంక్ మృణాల్ ఘోష్‌కు ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో వైద్యనాథన్ 75,000 ఈక్విటీ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చారు.
- భారత వాయు సేనలో సేవలు అందించిన రిటైర్డ్ వింగ్ కమాండర్ సంపత్‌కుమార్‌కు 2 లక్షల 50 వేల షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనితో ఆయన జీవిత చరమాంకం సంతృప్తిగా జీవించడానికి వీలవుతుంది.
- వైద్యనాథన్ ఎ.కనోజియా అనే అతనికి గృహ కొనుగోలు కోసం 2.75 లక్షల షేర్లను, మనోజ్ సహాయ్ అనే స్నేహితునికి 50 వేల షేర్లను కానుకగా ఇచ్చారు.