Link PAN With Aadhaar By May 31 To Avoid Higher TDS Deduction :అధిక పన్ను బాదుడు బారిన పడకూడదని భావించే వాళ్లంతా మే 31లోగా తప్పకుండా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేసుకోని వారిపై సాధారణం కంటే రెట్టింపు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్)ను విధించనున్నారు. అంటే మూల ఆదాయం లేదా వేతనంపై పన్ను వడ్డింపు రెట్టింపు అవుతుందన్న మాట. ఈ విషయంలో పన్ను చెల్లింపుదారులంతా అలర్ట్ కావాలంటూ ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది.
ఒకవేళ పాన్-ఆధార్‌లను లింక్ చేసుకుంటే టీడీఎస్ మినహాయింపు అతి స్వల్పంగా ఉంటుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది. బ్యాంకులు, ఫారెక్స్ డీలర్ల వంటి సంస్థలు స్టేట్‌మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ (ఎస్‌ఎఫ్‌టీ)ను ఫైల్ చేయడానికి మే 31 లాస్ట్ డేట్ అని గుర్తు చేస్తూ ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ పోస్ట్ చేసింది. సమయానికి ఎస్ఎఫ్‌టీ సమర్పిస్తే జరిమానాలు పడవని తెలిపింది.
ఎస్ఎఫ్‌టీలు సమర్పించకుంటే, రోజుకు రూ.1000 దాకా ఫైన్
ఫారెక్స్ డీలర్లు, బ్యాంకులతో పాటు సబ్ రిజిస్ట్రార్లు, ఎన్‌బీఎఫ్‌సీలు, పోస్టాఫీసులు, బాండ్లు/డిబెంచర్లు జారీ చేసే సంస్థలు, మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు ఎస్ఎఫ్‌టీలను సమర్పిస్తుంటారు. కంపెనీల డివిడెండ్ లావాదేవీలు, షేర్ల బై బ్యాక్ వ్యవహారాలపైనా ఎస్ఎఫ్‌టీలను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ సంస్థలన్నీ నిర్దిష్ట ఆర్థిక లావాదేవీల వివరాలను ఐటీ శాఖకు సవివరంగా అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ఎఫ్‌టీ రిటర్న్‌ల దాఖలులో జాప్యం జరిగితే, డీఫాల్ట్ అయిన ఒక్కో రోజుకు రూ.1,000 దాకా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఎస్ఎఫ్‌టీలను సమర్పించకపోవడం, తప్పుడు వివరాలతో వాటిని సమర్పించడం కూడా జరిమానాల పరిధిలోకి వస్తుంది. అధిక విలువ కలిగిన లావాదేవీలను పర్యవేక్షించేందుకు ఎస్ఎఫ్‌టీలు కీలకమైన డాక్యుమెంట్లుగా ఐటీ శాఖకు ఉపయోగపడతాయి.