How To Use Digi Locker In Telugu : వాహనం నడుపుతూ రోడ్డు మీద వెళ్లాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే పాన్‌కార్డ్ ఉండాల్సిందే. ఇక టికెట్ రిజర్వేషన్ చేసుకొని ప్రయాణం కొనసాగించాలన్నా ఆధార్‌కార్డు లాంటి ఏదైనా గుర్తింపుకార్డు చూపించాలి. ప్రభుత్వం జారీ చేసిన ఈ గుర్తింపు కార్డులు మనకు నిత్యం ఏదోక విధంగా అవసరం అవుతూనే ఉంటాయి. దీంతో ఎక్కడికి వెళ్లినా వీటిని తీసుకెళ్లాల్సి వస్తోంది. వీటిని ఫిజికల్‌గా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఎల్లప్పుడూ మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లో డిజిటల్ రూపంలో ఉండేలా ప్రభుత్వం డిజీలాకర్‌ను తీసుకొచ్చింది. అసలు ఈ లాకర్ అంటే ఏమిటి? ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
డిజీలాకర్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఇందులో సర్టిఫికెట్లు, పత్రాలు సురక్షితంగా భద్రపరచుకోవచ్చు. కావాల్సినప్పుడు సులువుగా యాక్సెస్ చేయొచ్చు. పదోతరగతి సర్టిఫికెట్ నుంచి ఆధార్, పాన్, రేషన్ ఇలా ప్రభుత్వం జారీ చేసిన అన్ని డాక్యుమెంట్‌లనూ డిజిటల్ రూపంలో దాచుకోవడానికి ఈ డిజీలాకర్ ఉపయోగపడుతుంది. జీవిత బీమా వంటి ముఖ్యమైన పత్రాలను కూడా ఇందులో దాచుకోవచ్చు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయి ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన సందర్బాల్లో డిజీలాకర్‌లో ఉన్న పత్రాలు చూపించొచ్చు. ఇలా ఎక్కడైనా, ఎప్పుడైనా వీటిని వినియోగించుకోవచ్చు. కేవలం ప్రభుత్వం అందించే డాక్యుమెంట్లే కాకుండా ఇతర విలువైన పత్రాలను డిజిటల్ రూపంలో భద్రపరచుకోవచ్చు.
ఎలా వినియోగించాలంటే?
- మీ ఫోన్‌లో డిజీలాకర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆరంకెల సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయాలి.
- మీ ఆధార్‌కార్డ్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి.
- తర్వాత ఆధార్ నంబర్ లేదా ఆరంకెల సెక్యూరిటీ సాయంతో సైన్- ఇన్ అవగానే మీ ఆధార్ కార్డు వివరాలు అందులో ప్రత్యక్షమవుతాయి. పైన కుడివైపున మీ ఫొటో కనిపిస్తుంది.
- యాప్‌లో కింద ఉన్న సెర్చ్ సింబల్‌పై క్లిక్ చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోగానే పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్ల లిస్ట్ ప్రత్యక్షమవుతాయి.
- వాటిలో మీ ప్రాంతం, యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకొని హాల్‌టికెట్ నంబర్, ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఎంటర్ చేసి సులభంగా డాక్యుమెంట్లు పొందొచ్చు.
- వీటితో పాటు పాన్, రేషన్ లాంటి ప్రభుత్వ గుర్తింపుకార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న పత్రాలు కింద ఉన్న డిజీలాకర్ డ్రైవ్‌లో కనిపిస్తాయి.