How To Clear Loans Fast : అవసరానికి అప్పు చేయడం కొన్నిసార్లు తప్పకపోవచ్చు. తీసుకున్న రుణాన్ని తొందరగా తీర్చేయడమే ఆర్థిక క్రమశిక్షణ. రుణాలను తొందరగా తీర్చాలంటే ముందుగా ఖర్చులను అర్థం చేసుకోవాలి. వాటిని ఎక్కడ తగ్గించాలో తెలుసుకోవాలి. నెలవారీ ఖర్చులతోపాటు ఏడాదికోసారి చేసే ఖర్చులను ఇందులో చేర్చాలి. ఎప్పటికప్పుడు బ్యాంకు అకౌంట్స్, క్రెడిట్ కార్డు బిల్స్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి. వచ్చే ఆదాయంతో పాటు అద్దె లేదా హోమ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్, వెహికల్ ఈఎంఐ, కిరాణా, కరెంట్ బిల్లుల ఖర్చులతో పాటు సరదాలు, మిగతా అత్యవసర ఖర్చులను లెక్కలు రాసుకుంటూ ఉండాలి(Debt Financial Planning).
అప్పుల లిస్ట్
పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్, క్రెడిట్ కార్డు బిల్స్, బయట తీసుకున్న రుణాలు అన్నీ ఒక దగ్గర లిస్ట్ చేసి పెట్టుకోండి. ఒక్కో లోన్‌కు ఎంత చెల్లిస్తున్నారు? దానికి వడ్డీ ఎంత? అనే దానిపై పూర్తిగా అవగాహన ఉండాలి. దీనివల్ల సంపాదించే దానిలో వడ్డీగా ఎంత కడుతున్నారో అర్ధం అవుతుంది.
బడ్జెట్ అవసరం
ఆదాయం, ఖర్చుల గురించి అవగాహన వచ్చిన తర్వాత, త్వరగా లోన్‌ను ఎలా తీర్చాలి అనేదాని గురించి ఆలోచించాలి. మామూలుగా ఖర్చులు నెలవారీగా మారుతుంటాయి. కానీ, ఆదాయంలో మాత్రం తేడా ఉండదు. అనవసర ఖర్చులను కచ్చితంగా ఆపాల్సిందే. సాధారణంగా ఇవన్నీ లగ్జరీ లైఫ్‌స్టైల్ ఖర్చులే. వీటిని తగ్గించడం వల్ల రొటీన్ జీవితంలో పెద్ద మార్పు ఉండదు. ఇలాంటి ఖర్చులను కనీసం 60 శాతమైనా తగ్గించే ప్రయత్నం చేయాలి.
ప్రాధాన్యత ఖర్చులు ముఖ్యం
తప్పనిసరి నెలవారీ ఖర్చులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు హోమ్ లోన్ లేదా ఇంటి అద్దె, కిరాణా ఖర్చులు, కరెంట్, మొబైల్ బిల్స్ వీటికి డబ్బును కేటాయించిన తర్వాత మిగిలిన సంపాదన లోన్ వాయిదాలను చెల్లించేందుకు ప్రయత్నించాలి. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ తొందరగా తీర్చేయడంపై దృష్టి పెట్టాలి. క్రెడిట్ కార్డు లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, హోమ్ లోన్ ఇలా ప్రాధాన్యాలను నిర్ణయించుకోవాలి. అయితే ఖర్చులు, లోన్ వాయిదాలు మాత్రమే కాదు పెట్టుబడులు కూడా ముఖ్యం. ఆదాయంలో కనీసం 10-15 శాతం పెట్టుబడి పెట్టాలి. అప్పులు తీరిన తర్వాత ఈ పెట్టుబడి శాతం కొంచెం పెంచుకోవాలి. ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే లోన్స్ తీర్చడానికి ఎమర్జెన్సీ ఫండ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు.
వాయిదా అలవాటు చేసుకోండి
మీకు నిజంగా ఏది అవసరమో తెలుసుకోవాలనుకుంటే ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు కనీసం 2 రోజుల పాటు దాని గురించి ఆలోచించాలి. ఆ తర్వాత 30 రోజులు వస్తువు అవసరం ఎంత అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పటికీ అది కావాల్సిందే అనుకున్నప్పుడే కొనాలి. అప్పు చేసి కాకుండా, అవసరమైన డబ్బును ఆదా చేసి కొనడం అలవాటు చేసుకోవాలి.