How To Choose Best Health Insurance Policy :ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలంటే దాని గురించి మనం చాలా అధ్యయనం చేస్తాం. ఆ వస్తువు మనకు ఎంత మేర అవసరం? అది సరైన ధరకు వస్తుందా? అనేవి చూస్తుంటాం. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో అంతకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
1. ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం చూసుకోవద్దు!
అవసరం ఏమిటన్నది పట్టించుకోకుండా చాలామంది ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన కుటుంబం మొత్తానికి వర్తించేలా రూ.5 లక్షల పాలసీ తీసుకున్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది సరిపోతుందా? అనుకోకుండా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే పరిస్థితి ఏమిటి? ప్రస్తుత కాలంలో వైద్య ఖర్చులు ఎంతగా పెరిగిపోయాయో అందరికీ తెలుసు. అందుకే, ఆరోగ్య బీమా పాలసీని ఎంత విలువకు తీసుకోవాలనే విషయాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
2. ఏజ్ ఆధారంగా
వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్యం బారిన పడుతుంటాం. చికిత్స ఖర్చులూ పెరుగుతుంటాయి. చిన్న వయసులో ఉన్నప్పుడు ఆరోగ్య బీమా ప్రీమియం ధరలు తక్కువగా ఉంటాయి. పాలసీని క్లెయిం చేసుకునే అవసరమూ అంతగా రాదు. కాబట్టి, నో క్లెయిమ్ బోనస్ లాంటివి పాలసీల విలువలో జమ అవుతూ ఉంటాయి. 50 ఏళ్ల వయసు వారు ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనుకుంటే కనీసం రూ.10లక్షలకు తక్కువ కాకుండా చూసుకోవాలి.
3. ఖర్చు ఎంత?
చాలా మంది ఎప్పుడూ మంచి గురించే ఆలోచిస్తుంటాం. ఇది మంచిదే. కానీ, అనుకోని సమస్య ఎదురైతే ఏం చేయాలన్నదీ ఆలోచించుకోవాలి. ఒకవేళ కుటుంబంలోని ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరితే ఎంత ఖర్చవుతుంది అనే విషయాన్ని అంచనా వేసుకోవాలి. దీనికోసం మీ దగ్గర్లో ఉన్న మంచి ఆసుపత్రిలో చికిత్స ధరలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఆరోగ్య బీమా పాలసీ ఎంత ఉంటే బాగుంటుందనే విషయంలో స్పష్టత వస్తుంది.
4. చరిత్ర తెలుసుకోవాలి
మీ కుటుంబంలోని వ్యక్తులకు తీవ్ర వ్యాధులకు సంబంధించిన చరిత్ర ఉంటే, మీరూ ఈ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోక తప్పదు. అనుకోని పరిస్థితుల్లో అలాంటి తీవ్ర వ్యాధుల బారిన పడినప్పుడు ఎంత ఖర్చు అవుతుందన్నది చూసుకొని, బీమా మొత్తంపై నిర్ణయం తీసుకోవాలి.