తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రతి చిన్న అవసరానికి క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? మీ 'సిబిల్ స్కోర్'​పై పడే ఎఫెక్ట్ ఇదే! - How Does Loans Affect Credit Score

How Does A Personal Loan Affect Your Credit Score : మీరు ప్రతి చిన్న అవసరానికి క్రెడిట్ కార్డ్ వాడుతుంటారా? అయితే ఇది మీ కోసమే. మీ క్రెడిట్ కార్డ్ వినియోగం, క్రెడిట్ స్కోర్​పై ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 12:07 PM IST

How does CIBIL Score Impact on Home Loan
How Personal Loans Can Impact Your Credit Score (Getty Images)

How Does A Personal Loan Affect Your Credit Score :నేటి కాలంలో ప్రతి చిన్న అవసరానికీ క్రెడిట్ కార్డ్ వాడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. క్రెడిట్‌ బ్యూరో ఎక్స్‌పీరియన్‌ ఇండియా నివేదిక ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో క్రెడిట్ కార్డ్ రుణాల్లో దాదాపు 19% వృద్ధి నమోదు అయ్యింది. వ్యక్తులు లోన్​ తీసుకునేటప్పుడు, ఆర్థిక సంస్థలు వారి క్రెడిట్‌ స్కోరును కచ్చితంగా పరిశీలిస్తాయి. ముఖ్యంగా నేటి అధునాతన సాంకేతికత, నిబంధనలు క్రెడిట్‌ స్కోరును లెక్కించే తీరును మార్చేశాయి. దీంతో మీ క్రెడిట్ స్కోర్​ను ప్రభావితం చేసే అంశాలు కూడా చాలా మారాయి.

క్రెడిట్​ స్కోర్​లో వ్యత్యాసం!
నేడు దేశంలో క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు చాలా కీలకంగా మారాయి. వినియోగదారుల క్రెడిట్‌ రిపోర్ట్​లను రూపొందించేందుకు ఇవి ఎంతో సమాచారాన్ని సేకరిస్తున్నాయి. వాటిని విశ్లేషిస్తున్నాయి. మన దేశంలో ప్రధానంగా ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్, ఎక్స్‌పీరియన్‌ క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా, క్రిఫ్‌ హై మార్క్‌ క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్, ఈక్విఫాక్స్‌ క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్ మొదలైనవి క్రెడిట్‌ స్కోరును అందిస్తున్నాయి. ఈ సంస్థలు సేకరించే సమాచారంతోపాటు, అవి గణించే విధానాన్ని బట్టి మీ క్రెడిట్‌ స్కోర్లలో వ్యత్యాసం ఉంటుంది.

ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది!
క్రెడిట్‌ స్కోరును 6 నెలలకోసారి లేదా ఏడాదికి ఒకసారి చొప్పున లెక్కించరు. ఇది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. మీరు మీ క్రెడిట్‌ రిపోర్టు కావాలని కోరినప్పుడు, అప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు క్రెడిట్​ బ్యూరోలు మీ క్రెడిట్​ స్కోర్​ను అందిస్తాయి.

'కొత్త రుణం కోసం చేసుకున్న దరఖాస్తులు, మీరు అప్పులు తీర్చిన విధానం, వాయిదాల చెల్లింపులో ఆలస్యం ఇలాంటి వన్నీ మీ క్రెడిట్ స్కోర్​ను ప్రభావితం చేస్తాయి' అని ఎక్స్‌పీరియన్‌ ఇండియా కంట్రీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీశ్‌ జైన్‌ వివరించారు. కనుక బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పంపినప్పుడల్లా స్కోరు మారిపోతుందని ఆయన తెలిపారు.

అవసరం లేకపోయినా!
చాలా మంది తమకు అవసరం లేకపోయినా పలు రుణ యాప్‌ల్లో, బ్యాంకింగ్‌ యాప్‌లలో లోన్​ కోసం అప్లై చేస్తూ ఉంటారు. కానీ చివరి నిమిషంలో కొన్నింటిని వద్దనుకుంటారు. అయితే ఇవన్నీ వారిక్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపిస్తుంటాయి. కచ్చితంగా చెప్పాలంటే, మీరు లోన్​ కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ, మీ స్కోరుపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. కనుక, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే రుణం కోసం దరఖాస్తు చేయడం మంచిది.

పరిమితంగా వినియోగించాలి!
మీ క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి కూడా మీ క్రెడిట్​ స్కోరును ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు మీ దగ్గర 3 క్రెడిట్‌ కార్డులు ఉన్నాయని అనుకుందాం. మీరు ఈ 3 కార్డుల్లోనూ 80 % పరిమితిని వినియోగించుకున్నారు. దీన్ని బ్యూరోలు అధిక క్రెడిట్‌ వినియోగంగా పరిగణిస్తాయి. ఫలితంగా మీ క్రెడిట్​ లేదా సిబిల్ స్కోర్ తగ్గుతుంది. అలా కాకుండా మీ దగ్గర ఉన్న 3 క్రెడిట్​ కార్డులనూ, ఒక్కో దాన్ని 30 శాతానికి మించకుండా వినియోగిస్తే, అప్పుడు మీ క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉంటుంది.

తనిఖీ చేసుకోవాల్సిందే!
తరచూ చెక్ చేసుకుంటే, క్రెడిట్ స్కోర్​ తగ్గుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. చాలా క్రెడిట్ బ్యూరోలు ఉచితంగా క్రెడిట్‌ నివేదికను పొందే అవకాశం కల్పిస్తున్నాయి. కనుక సకాలంలో రుణ వాయిదాలు చెల్లిస్తున్న వారు, కనీసం 6 నెలలకోసారైనా తమ క్రెడిట్ రిపోర్ట్​ను చెక్ చేసుకోవడం మంచిది. అప్పుడే మీ క్రెడిట్ నివేదికలో ఏమైనా పొరపాట్లు ఉంటే, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.

క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి?
చాలా బ్యాంకులు 750కి మించి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తాయి. అయితే కొన్ని బ్యాంకులు 694 పాయింట్ల దగ్గర్నుంచీ రుణాలు ఇస్తుంటాయి. మరికొన్ని బ్యాంకులు క్రెడిట్ స్కోర్ 645 ఉన్నప్పటికీ రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. కాకపోతే, వడ్డీ రేటు కాస్త అధికంగా విధిస్తాయి.

రుణం తీర్చినప్పటికీ!
కొన్ని సార్లు మనం రుణాలు తీర్చేసినప్పటికీ, మీ క్రెడిట్ రిపోర్ట్​లో మాత్రం అప్పు ఉన్నట్లుగానే కనిపిస్తుంది. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ పెరగకపోగా, తగ్గినట్లు కనిపిస్తుంది. కనుక మీరు రుణం ముందే తీర్చినా లేదా బదిలీ చేసుకున్నా అది క్రెడిట్ నివేదికలో కనిపించేలా చూసుకోవాలి. ఒకవేళ కనిపించకపోతే వెంటనే బ్యాంకు/ఆర్థిక సంస్థను సంప్రదించి, రుణం తీరినట్లు నమోదు చేయాలని అడగాలి. అప్పుడే వారు తగిన మార్పు చేస్తారు.

కష్టపడి ఇల్లు కట్టుకున్నారా? బీమా చేసి ధీమాగా ఉండండి! - Home Insurance Policy Benefits

మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేరా? అయినా 'NIL ITR' ఫైల్​ చేయొచ్చు! ఇలా చేస్తే ఫుల్​ బెనిఫిట్స్! - Nil Income Tax Return Filing

ABOUT THE AUTHOR

...view details