తెలంగాణ

telangana

ETV Bharat / business

లగ్జరీ ఇళ్లకే జై- దేశంలో తగ్గిన మిడిల్​ క్లాస్​ గృహాల విక్రయాలు- ఎందుకిలా? - Home Sales Report January 2024

Home Sales Report January 2024 : దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల్లో లగ్జరీ ఫ్లాట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో 2024 జనవరి-మార్చి మధ్యలో సరసమైన గృహాల విక్రయాలు భారీగా తగ్గాయి. 2024 జనవరి-మార్చి మధ్య దేశంలో ఎన్ని ఇళ్లు అమ్ముడయ్యాయంటే?

Home Sales Report January 2024
Home Sales Report January 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 3:33 PM IST

Home Sales Report January 2024 : లగ్జరీ ఫ్లాట్లకు ఫుల్ డిమాండ్ పెరగడం వల్ల దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల్లో 2024 జనవరి-మార్చి మధ్యకాలంలో సరసమైన గృహాల విక్రయాలు సగానికి పైగా తగ్గి 22 శాతానికి చేరుకున్నాయి. 2023లో ఇదే సమయానికి మొత్తం గృహాల విక్రయాల్లో సరసమైన నివాసాల వాటా 48 శాతంగా ఉంది. ఈ మేరకు దేశంలో గృహాల విక్రయాలపై హౌసింగ్ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్ టైగర్.కమ్ ఓ నివేదికను విడుదల చేసింది.

2024 జనవరి-మార్చి మధ్యకాలంలో దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల్లో హౌసింగ్ అమ్మకాలు 41 శాతం పెరిగి 1,20,640 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 85,840 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి-మార్చి మధ్యకాలంలో జరిగిన మొత్తం 1,20,640 యూనిట్ల విక్రయాల్లో రూ.25 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఇళ్ల వాటా 5 శాతంగా ఉంది. గతేడాది ఇదే కాలంలో మొత్తం విక్రయాల్లో ఈ తక్కువ ధర గృహాల కేటగిరీ వాటా 15 శాతం.

రూ. 25-45 లక్షల ధర కలిగిన గృహాల వాటా 2024 జనవరి-మార్చి మధ్య కాలంలో 17 శాతంగా ఉంది. ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 23 శాతం ఉంది. లగ్జరీ ఫ్లాట్ల కొనుగోలులో కొవిడ్ మహమ్మారి తర్వాత చెప్పుకోదగిన మార్పు వచ్చిందని ప్రాప్ టైగర్ తన త్రైమాసిక నివేదిక రియల్ ఇన్ సైట్ రెసిడెన్షియల్ జనవరి- మార్చి 2024లో పేర్కొంది. 2024 మొదటి త్రైమాసికంలో రూ. కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఆస్తుల వాటా గణనీయంగా 37 శాతానికి పెరిగిందని వెల్లడించింది. 2023 అదే కాలంలో 24 శాతం కంటే ఎక్కువగా ఉందని వివరించింది. రూ. 75 లక్షలు-రూ. కోటి ఖరీదు చేసే గృహాల వాటా ఈ ఏడాది జనవరి-మార్చిలో 12 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది.

2024 జనవరి-మార్చి మధ్యలో గృహాల విక్రయాలు రూ. 66,155 కోట్ల నుంచి రూ.1,10,880 కోట్లకు పెరిగాయి. విస్తీర్ణం పరంగా హౌసింగ్ అమ్మకాలు 2024 మొదటి త్రైమాసికంలో 63 శాతం పెరిగి 162 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 99 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ (NCR) హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), పుణెలో గృహ విక్రయాలపై ప్రాప్ టైగర్.కమ్ నివేదిక రూపొందించింది. గృహాల అమ్మకాలలో వృద్ధి శుభపరిణామమని ప్రాప్ టైగర్. కమ్ బిజినెస్ హెడ్ వికాస్ వాధావన్ తెలిపారు. సిమెంట్, స్టీల్‌ సహా 200 కంటే ఎక్కువ అనుబంధ పరిశ్రమలు ఆధారపడి ఉన్న గృహ రంగంలో విక్రయాలు ఆర్థిక వ్యవస్థకు మంచి ఊతమిస్తాయని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details