Be Alert For Bhadradri Devotees : "నీరు లోతుగా ఉన్నది, ప్రమాదం లోనికి వెళ్లరాదు" అని హెచ్చరిక బోర్డులు అంతటా ఉన్నా ప్రజల్లో మాత్రం అప్రమత్తత లేదు. అదే అక్కడ మరణాలకు కారణమవుతుంది. అటు దూర ప్రాంతాల నుంచి గోదావరి పరివాహక ప్రాంతానికి వెళ్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఆనందంలో నీటి లోపలికి వెళ్లి అనేకమంది మృత్యువాత పడుతున్నారు. అలానే కార్తిక మాసం సందర్భం సహా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం కోసం వస్తున్న భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడానికి నది లోపలకు దిగి నీటి లోతు తెలియక పలువురు ప్రాణాలు విడుస్తున్న ఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయి.
అందులోనూ ప్రధానంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, హనుమకొండ వంటి ప్రధాన నగరాల నుంచి రాముల వారి దర్శనం కోసం వస్తున్న భక్తులు ముందుగా ఆలయం వద్ద గల గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. గోదావరి నదిలో స్నానాలు చేసే క్రమంలో భక్తులు ఎలాంటి సూచనలు పాటించక పోవడం వల్ల ఇబ్బందులు పాలవుతున్నారు. గోదావరి లోతులోకి వెళ్లకూడదు అనే బోర్డులు ఉన్నప్పటికీ.. స్నానాలు చేసే భక్తులు బాగా లోతుకు వెళ్లకుండా ఇనుపకంచెను ఏర్పాటు చేసినప్పటికీ భక్తులు అవేమీ లెక్కచేయడం లేదు. స్థానిక అధికారులు సూచించిన సూచనలు పాటించకపోవడంతో మృత్యువాత పడాల్సిన పరిస్థితి నెలకొంది.
భక్తులు, చిన్నారులు లోతు తెలియక లోపలికి వెళ్లి : చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన భక్తులు గోదావరి నీటిని చూడగానే ఆనందంతో స్నానం చేయడానికి లోతుకు వెళ్లిపోతున్నారు. దగ్గరుండి చూసుకోకపోవడంతో చిన్నారులు లోతుకు వెళ్లి మునిగిపోతున్నారు. భద్రాచలం గోదావరి నది వద్ద ఇలాంటి ఘటనలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. భక్తులు, చిన్నారులు లోతు తెలియక లోపలికి వెళ్లి మునిగిపోతున్న సమయంలో అక్కడ ఉన్న స్థానికులు, బోటు నిర్వాహకులు సరైన సమయంలో గుర్తించడం వల్ల చాలామందిని కాపాడుతున్నారు.
గతంలో చాలామంది మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఇవాళ కూడా స్నానమాచరించడానికి వచ్చిన ఒక మహిళ లోతుకు వెళ్లడంతో మునిగిపోతుండగా అక్కడే ఉన్న ప్రసాద్ అనే గజ ఈతగాడు కాపాడి ఒడ్డుకు తీసుకురావడంతో ప్రాణాలతో బయటపడింది. అదే క్రమంలో మరొక వ్యక్తి కూడా లోతుకు వెళ్లి నీటిలో మునిగిపోతుండగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ అనేక ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు గోదావరి వద్ద పరిస్థితులు తెలియక అక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయి.
"దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చే భక్తులు గోదావరి నదిలో స్నానం చేసే క్రమంలో తప్పకుండా అక్కడ ఉన్న నిబంధనలు పాటించి స్నానం ఆచరిస్తే ప్రమాదాల బారిన పడకుండా బయటపడవచ్చు. భక్తులంతా కుటుంబంతో స్నానం చేయడానికి గోదావరి నది వద్దకు వెళ్లినప్పుడు పిల్లలను లోతుకు వెళ్లకుండా చుట్టూ కాపలా ఉండి స్నానం చేయించాలి. జాగ్రత్తలు పాటించడం వల్ల చాలామంది వారి ప్రాణాలను కాపాడుకోవచ్చు."-ప్రసాద్, బోటు నిర్వాహకుడు
భక్తులకు ముఖ్యమైన గమనికలు
నదిలోని నీటి స్థాయి : గోదావరి నదిలో నీటి స్థాయి కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ప్రత్యేకించి వర్షాకాలం తర్వాత నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే, నదిలో స్నానం చేయడానికి ముందు నీటి స్థాయి గురించి సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
నీటి ప్రమాదం : ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్నానం చేయడం చాలా ప్రమాదకరం. అందువల్ల, నదిలోని ప్రమాదకరమైన ప్రాంతాల గురించి స్థానిక అధికారులను సంప్రదించి, వారి సూచనలను పాటించడం మంచిది.
సామూహిక స్నానం : సామూహికంగా స్నానం చేసేటప్పుడు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలను వారి తల్లిదండ్రులు లేదా పెద్దవారు జాగ్రత్తగా చూసుకోవాలి. స్నానం చేసేటప్పుడు సురక్షితమైన స్థలాలను ఎంచుకోవాలి.