Gas Cylinder Price Hike Today : వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.62 మేర పెంచుతున్నట్లు వెల్లడించాయి. అలాగే 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల ధరలను కూడా రూ.15 మేర పెంచుతున్నట్లు పేర్కొన్నాయి. నవంబర్ 1వ తేదీ నుంచే కొత్త ధరలు అమలులోకి వస్తాయని తెలిపాయి. కాగా, గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి.
గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిన నేపథ్యంలో, దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.62 పెరిగి రూ.1802.50కు చేరుకుంది. కోల్కతాలో రూ.1911.50, ముంబయిలో రూ.1754.50కు చేరుకుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వరుసగా ఇది నాలుగోసారి. ఆగస్టులో రూ.6.5, సెప్టెంబర్లో రూ.39, అక్టోబరులో రూ.48.5 పెంచారు. ఇప్పుడు ఏకంగా రూ.62 మేర పెంచడం గమనార్హం.
వంట గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథం
ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం దిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.803గా ఉంది. ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం రూ.603కే ఇది లభిస్తుంది. ముంబయిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50, చెన్నైలో రూ.818.50, హైదరాబాద్ లో రూ.855గా ఉంది.
గ్యాస్ సిలిండర్ ధరలను నిర్ణయించేది ఎవరు?
ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వాణిజ్య గ్యాస్ సిలిండర్, వంట గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. కాగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం గత 20 నెలలుగా ఎటువంటి మార్పు లేదు.
ఎల్పీజీ సిలిండర్ ధరలను ఎలా, ఎక్కడ చెక్ చేయవచ్చు?
ఎల్ పీజీ సిలిండర్ అసలు ధరలను తెలుసుకోవాలనుకుంటే ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ https://iocl.com/prices-of-petroleum-productsలో చూడవచ్చు. ఇదే వెబ్సైట్లో ఎల్పీజీ ధరలతోపాటు, జెట్ ఫ్యూయెల్, ఆటో గ్యాస్, కిరోసిన్ మొదలైన ఇంధనాల ధరలను కూడా తెలుసుకోవచ్చు.