Hindenburg on SEBI Chief : సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌పై, అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొనసాగిస్తోంది. ఆమెకు వాటాలున్న కన్సల్టింగ్ సంస్థలకు సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని హిండెన్‌బర్గ్ సవాలు విసిరింది. ఈ ఆరోపణలు మాధబి దంపతలు స్పందించిన గంటల వ్యవధిలోనే హిండెన్‌బర్గ్ ఈ వ్యాఖ్యలు చేసింది. బెర్ముడా/మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్లలో తనకు పెట్టుబడులు ఉన్నట్లు మాధబి ఒప్పుకొన్నారని, అదానీ సంస్థలో డైరెక్టరుగా ఉన్న తన భర్త బాల్యమిత్రుడు ఆ ఫండ్‌ను నిర్వహించినట్లు కూడా ధ్రువీకరించారని హిండెన్‌బర్గ్ తెలిపింది. ఇవన్నీ చూస్తే కొన్ని కొత్త సందేహాలూ వస్తున్నాయని పేర్కొంది.
తాజా ఆరోపణలు
'భారత్, సింగపూర్‌లలో తాను ఏర్పాటు చేసిన రెండు కన్సల్టింగ్ కంపెనీల కార్యకలాపాలను, 2017లో తాను సెబీలో చేరాక నిలిపివేసినట్లు మాధబి స్వయంగా తెలిపారు. 2019లో వాటిని ఆమె భర్త టేకోవర్ చేసుకున్నారని పేర్కొన్నారు. తాజా వాటాదార్ల వివరాల ప్రకారం, అగోరా అడ్వయిజరీ లిమిటెడ్ (ఇండియా)లో 2024 మార్చి 31 నాటికి మాధబి పురి బచ్ 99% వాటా కలిగి ఉన్నారు. ఇప్పటికీ ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తూ, ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అగోరా అడ్వయిజరీ లిమిటెడ్ (సింగపూర్)లో మాధబికి 100 శాతం వాటాలు ఉన్నాయి. సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన 2 వారాల తర్వాత, ఆ సంస్థలో తన వాటాను ఆమె తన భర్తకు బదిలీ చేశారు. అయితే సింగపూర్ సంస్థ తన లాభదాయ వివరాలను బహిర్గతం చేయలేదు. దీంతో సెబీ పూర్తికాల సభ్యురాలిగా ఉన్న సమయంలో మాధబి ఈ సంస్థ ద్వారా ఎంత ఆర్జించారో తెలుసుకోవడం కష్టం' అని హిండెన్‌బర్గ్ పేర్కొంది.
భర్త పేరు మీద వ్యాపారం
ఇక భారత సంస్థలో మాధబి పురి బచ్ పేరు మీదుగా 99% వాటా ఉండగా, ఆమె సెబీ ఛైర్‌పర్స్‌గా ఉన్న సమయంలో ఈ సంస్థ రూ.2.40 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిందని హిండెన్‌బర్గ్ వెల్లడించింది. 'సెబీలో పూర్తి కాల సభ్యురాలిగా ఉన్న సమయంలోనే, మాధబి తన వ్యక్తిగత ఈ-మెయిల్‌ను ఉపయోగించి తన భర్త పేరు మీద వ్యాపారం నిర్వహించినట్లు ప్రజావేగు దస్త్రాలు చెబుతున్నాయి. ఇవన్నీ చూస్తే ఆమె అధికారిక హోదాలో ఉంటూ, మరేదైనా ఇతర వ్యాపారాలను తన భర్త పేరు మీద నిర్వహించారా? అనే సందేహాలు వస్తున్నాయి. వీటన్నింటిపై పారదర్శక దర్యాప్తునకు మాధబి సిద్ధంగా ఉండాలి. ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలి' అని హిండెన్‌బర్గ్ సూచించింది.