తెలంగాణ

telangana

ETV Bharat / business

జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై GST మినహాయింపు - GoM ప్రతిపాదన

టర్మ్ ఇన్సూరెన్స్‌, సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు - జీఓఎం ప్రతిపాదన - తుది నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్‌దే!

GST Exemption On Life Insurance
GST Exemption On Life Insurance (ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2024, 5:53 PM IST

Updated : Oct 19, 2024, 6:44 PM IST

GST Exemption On Life Insurance :జీవిత బీమా ప్రీమియంపై, సీనియర్ సిటిజన్లు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై వస్తు, సేవల పన్ను (జీఎస్​టీ)ను మినహాయించే అవకాశం ఉందని సమాచారం. శనివారం జరిగిన జీఓఎం సమావేశంలో రూ.5 లక్షలలోపు కవరేజ్‌ ఉన్న వ్యక్తిగత టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంపై జీఎస్​టీ మినహాయించాలని నిర్ణయించారు. అలాగే సీనియర్ సిటిజన్లు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలపై కూడా జీఎస్​టీ మినహాయింపు ఇవ్వాలని తీర్మానించారు. అయితే ఈ విషయంలో జీఎస్​టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది.

ఆ పాలసీలకు మినహాయింపు లేదు!

  • ఇకపై కూడా రూ.5 లక్షల కంటే ఎక్కువ కవరేజ్ ఉన్న ఆరోగ్య బీమా పాలసీలకు జీఎస్​టీ నుంచి ఎలాంటి మినహాయింపు ఉండదు. అంటే రూ.5లక్షల కంటే ఎక్కువ కవరేజ్ ఉన్న పాలసీల కోసం చెల్లించే ప్రీమియంలపై ఎప్పటిలానే 18 శాతం జీఎస్​టీ వసూలు చేస్తారు.
  • ప్రస్తుతం టర్మ్‌ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలపై చెల్లించే ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. కానీ ఇకపై రూ.5 లక్షల లోపు కవరేజ్‌ ఉన్న పాలసీ ప్రీమియంలపై జీఎస్​టీ మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది.

సీనియర్‌ సిటిజన్ల కోసం
బిహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ, "GoMలోని ప్రతి సభ్యుడు ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లపై జీఎస్​టీ భారం పడకుండా చూడాలని భావిస్తున్నారు. అందుకే సీనియర్ సిటిజన్లు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్​టీని పూర్తిగా మినహాయించాలని కౌన్సిల్‌కు నివేదిక సమర్పించనున్నాం. అయితే దీనిపై జీఎస్​టీ కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకుంటుంది" అన్నారు. దీనిని బట్టి కవరేజ్‌తో సంబంధం లేకుండా సీనియర్ సిటిజన్లు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్​టీని పూర్తిగా మినహాయించే అవకాశం ఉంది.

జీఎస్​టీ కౌన్సిల్‌ గత నెలలో జరిగిన సమావేశంలో ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పన్నును నిర్ణయించేందుకు 13 మంది సభ్యులతో ఓ జీఓఎంను ఏర్పాటు చేసింది. దీని కన్వీనర్‌గా సామ్రాట్ చౌదరి ఉన్నారు. ఈ ప్యానెల్‌లో యూపీ, రాజస్థాన్‌, బంగాల్‌, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్‌, మేఘాలయ, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ మంత్రులు ఉన్నారు. అక్టోబర్‌ నెలాఖరులోగా ఈ జీఓఎం తన నివేదికను జీఎస్​టీ కౌన్సిల్‌కు సమర్పించాల్సి ఉంటుంది.

Last Updated : Oct 19, 2024, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details