Health Insurance Claim Govt Portal :ఆరోగ్య బీమా పాలసీ అత్యవసర సమయంలో అండగా నిలుస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లోకి జారుకోకుండా ఆదుకుంటుంది. అయితే కొన్నిసార్లు ఆరోగ్య బీమా క్లెయిమ్స్ తిరస్కరణకు గురవుతుంటాయి. అవసరమైన పత్రాలు సమర్పించకున్నా, చాలా ఆలస్యంగా సమర్పించినా క్లెయిమ్‌లను తిరస్కరిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అన్ని వివరాలను సరిగ్గా పేర్కొన్నా కూడా క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్మెంట్లను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఇందులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు కొత్త పోర్టల్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలోనే 'నేషనల్ క్లెయిమ్ ఎక్స్ఛేంజ్ పోర్టల్'ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బీమా కంపెనీలు, ఆసుపత్రులు, పాలసీదారులకు మధ్య ఇది ఉమ్మడి వేదికగా మారనుంది. బీమా రంగంలోనే ఇదొక కీలక మలుపుగా మారనుంది.
ఇకపై ఆలస్యం కాకుండా!
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కింద ప్రభుత్వం ఈ కొత్త పోర్టల్‌ను తీసుకువస్తోంది. దీంతో ఆరోగ్య బీమా క్లెయిమ్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. రానున్న రెండు, మూడు నెలల్లో దేశమంతటా ఈ పోర్టల్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే 50 బీమా కంపెనీలు, 250 అసుపత్రులను కూడా అనుసంధానించింది. క్రమంగా మరిన్ని ఆసుపత్రులను, బీమా ప్రొవైడర్లనూ అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్, పారామౌంట్ టీపీఏ, బజాజ్ అలయన్జ్ ఇన్సూరెన్స్ వంటి ఎన్నో ప్రముఖ కంపెనీలు పోర్టల్‌తో అనుసంధానాన్ని పూర్తి చేశాయి. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ ప్రక్రియ ప్రధానంగా మాన్యువల్ విధానాలపై ఆధారపడి ఉంది. దీంతో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఈ కొత్త పోర్టల్‌ను తీసుకురానుంది.