Business Loan Documents : మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా? ఇందుకోసం బ్యాంక్ లోన్ కావాలా? అయితే ఇది మీ కోసమే. బ్యాంక్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి కావాల్సిన కీలక పత్రాలు గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పెద్ద పెద్ద కంపెనీలకు, బ్రాండ్‌లకు బ్యాంకులు చాలా సులువుగా రుణాలు మంజూరు చేస్తాయి. కనుక ఆ బడా కంపెనీలు చాలా సులువుగా తమ వ్యాపార కార్యకలాపాలను, బిజినెస్‌ను పెంచుకోగలుగుతాయి. కానీ కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కాస్త ఆలోచిస్తాయి. కనుక స్టార్టప్స్ మొదలు పెట్టాలని అనుకునేవారికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అయితే కొన్ని కీలకమైన పత్రాలు సమర్పించడం ద్వారా బ్యాంకులు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి సులువుగా లోన్ పొందే అవకాశం ఉంటుంది.
Business Loan Documents : వ్యాపార విస్తరణ, పరికరాల కొనుగోలు, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, వర్కింగ్ క్యాపిటల్ - మొదలైన అవసరాల కోసం బిజినెస్ లోన్ అవసరం అవుతుంది. ఇందుకోసం మనం ఏయే పత్రాలు సమర్పించాలనేది ఆయా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను బట్టి మారిపోతుంది. కానీ దాదాపు అన్ని బ్యాంకులు అడిగే కొన్ని కామన్ లోన్ డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
- కంపెనీ ఐడెంటిటీ ప్రూఫ్ : మీకు బిజినెస్ లోన్ కావాలంటే, ముందుగా మీ కంపెనీ ఒకటి ఉందని రుజువు చేసే పత్రాలను బ్యాంక్‌కు సమర్పించాలి. అంటే మీ కంపెనీ పేరుమీదున్న పాన్ కార్డ్, వాటర్ బిల్లు, విద్యుత్ బిల్లు, బిజినెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లాంటి వాటిని బ్యాంకుకు సమర్పించాలి.
- వ్యక్తిగత గుర్తింపు పత్రాలు : బ్యాంకు రుణాలు మంజూరు చేయాలంటే, ముందుగా మీ వ్యక్తిగత గుర్తింపు పత్రాలను అందించాల్సి ఉంటుంది. అంటే ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ - కాపీలను బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది.
- అడ్రస్ ప్రూఫ్ : బ్యాంక్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు కచ్చితంగా మీ చిరునామా వివరాలను అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి ఇవ్వవచ్చు.
- ఫైనాన్సియల్ డాక్యుమెంట్స్ : బిజినెస్ లోన్ కావాలంటే బ్యాంకులకు కచ్చితంగా మీ వ్యాపారానికి సంబంధించిన లాభనష్టాల వివరాలు, బ్యాలెన్స్ షీట్లు, పాస్‌బుక్‌లు, అకౌంట్ స్టేట్‌మెంట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
- బ్యాంక్ స్టేట్‌మెంట్స్ : బ్యాంకులు రుణాలు మంజూరు చేసేముందు కచ్చితంగా మీ వ్యక్తిగత, వ్యాపారానికి సంబంధించిన అన్ని బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలిస్తాయి. సాధారణంగా బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్లను అడుగుతాయి. కొన్ని అయితే మొత్తం ఆ సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌ను అడగవచ్చు.
- బిజినెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ : బిజినెస్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు కచ్చితంగా ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికెట్, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ట్రేడ్ లైసెన్స్, ఎంఎస్‌ఎంఈ/ ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్ మొదలైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
- పన్ను రిటర్నులు : బ్యాంకులు మీ ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులకు సంబంధించిన వివరాలు కూడా అడుగుతాయి.
- కేవైసీ పత్రాలు : ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికెట్, పార్టనర్‌షిప్ డీడ్, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్ లాంటి కేవైసీ పత్రాలను కూడా బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు?
ప్రస్తుతం బ్యాంకింగ్ కార్యకలాపాలు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. అలాగే బ్యాంకులకు సంబంధించిన బిజినెస్ లోన్ యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కనుక వీటిలోకి లాగిన్ అయ్యి, మీ వ్యాపారానికి సంబంధించిన వివరాలు నమోదు చేసి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయవచ్చు. మీకు కనుక బ్యాంకులతో ముందుగానే మంచి రిలేషన్‌షిప్ ఉంటే, చాలా సులువుగా, తొందరగా లోన్ లభించే అవకాశం ఉంటుంది.
మీ కంపెనీని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడానికి, మీ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడానికి బ్యాంకు రుణాలు సాయపడతాయి. ఇవి మీకు ఆర్థికంగా ఒక భద్రతావలయాన్ని కూడా సృష్టిస్తాయి. అందుకే బిజినెస్ లోన్‌కు అప్లై చేసే ముందు కచ్చితంగా అన్ని రకాల డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
వ్యాపారం చేసేందుకు పెట్టుబడి కావాలా? పూచీకత్తు లేకుండా బిజినెస్ లోన్ ఆప్షన్స్ ఇవే!
MSMEలకు ఎలాంటి హామీ లేకుండా బ్యాంక్ లోన్స్ - రూ.100 కోట్ల వరకు!