Government Clarification On New Tax Regime :కొత్త పన్ను విధానంలో పలు మార్పులు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ప్రచారం అవుతోంది. దీనితో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ స్వయంగా వివరణ ఇచ్చారు. నూతన పన్ను విధానంలో కొత్తగా ఎలాంటి మార్పులు చేయలేదని స్పషం చేశారు.
2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి 2024-25 నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. దీనితో పలు కొత్త ఆర్థిక నిబంధనలు, పన్ను నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే సామాజిక మాధ్యమాల్లో కొత్త ఆదాయ పన్ను విధానానికి (New Tax Regime) సంబంధించి తప్పుదారిపట్టించే సమాచారం ప్రచారమవుతోంది. ఈ విషయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ దృష్టికి వచ్చింది. దీనితో స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంపై ప్రజల్లో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ పలు కీలకాంశాలను 'ఎక్స్' (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ!
- 2024 ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది. కానీ దీనిలో కొత్తగా చేసిన మార్పులు ఏమీ లేవు.
- పాత పన్ను విధానం స్థానంలో సెక్షన్ 115BAC(1A) కింద, కొత్త పన్ను విధానాన్ని ఆర్థిక చట్టం 2023లో ప్రవేశపెట్టారు.
- 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు, సంస్థలు కాకుండా, సాధారణ వ్యక్తులు అందరికీ కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా వర్తిస్తుంది.
- కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి. అయితే పాత పన్ను విధానంలో కల్పిస్తున్న మినహాయింపులు, డిడక్షన్స్ కొత్త పన్ను విధానంలో లేవు. కానీ స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, ఫ్యామిలీ పెన్షన్ రూ.15,000 మాత్రం ఉంటాయి.
- కొత్త పన్ను విధానం ఇక నుంచి డీఫాల్ట్‌గా వర్తిస్తుంది. అయితే ట్యాక్స్ కట్టేవారికి మాత్రం ఛాయిస్ ఉంటుంది. కనుక పన్ను చెల్లింపుదారులు తమకు నచ్చిన, లాభదాయకంగా ఉన్న పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. అంటే కొత్త లేదా పాత పన్ను విధానాల్లో ఏది లాభదాయకంగా ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
- 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేసే వరకు కొత్త పన్ను విధానం నుంచి వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు, ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే వీలు ఉంటుంది. అంటే వారు ఒక ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని, మరొక ఫైనాన్సియల్ ఇయర్లో పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.