Gold Price Forecast In 2025 :భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఇలానే కొనసాగితే 2025లోనూ బంగారం ధరలు బాగా పెరిగే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నూతన సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ.85,000 నుంచి రూ.90,000 వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు.
ప్రభుత్వాల ద్రవ్య విధానాలు, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఇప్పటిలానే కొనసాగితే, బంగారానికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ భౌగోళిక రాజకీయ సంక్షోభాలు తగ్గి, రూపాయి విలువ క్షీణిస్తే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.79,350 వరకు ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర రూ.76,600 వరకు ఉంది.
ఆల్ టైమ్ రికార్డ్ హై
ఈ 2024లో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగి, మదుపరులకు దాదాపు 23 శాతం రాబడిని సాధించి పెట్టాయి. ముఖ్యంగా ఈ ఏడాది అక్టోబర్ 30న 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.82,400కు చేరుకుని ఆల్ టైమ్ హైరికార్డ్ను నెలకొల్పింది. ఈ ఏడాది వెండి కూడా మదుపరులకు అద్భుతమైన (30 శాతం వరకు) లాభాలను తెచ్చిపెట్టింది. ఒక కేజీ వెండి ధర రూ.1 లక్ష రూపాయలు దాటింది.
ఇక గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే, ఈ ఏడాది ప్రారంభంలో కోమెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 2,062 డాలర్ల వద్ద ప్రారంభమైంది. అక్టోబర్ 31 నాటికి 2,790 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరింది. దీనితో మదుపరులకు ఏకంగా 28 శాతం మేర లాభం వచ్చింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో బంగారం- మదుపరులకు మంచి పెట్టుబడి అవకాశాన్ని కల్పించింది.
2025లోనూ లాభాల పంటే?
ఇప్పుడున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఇలాగే కొనసాగితే, సెంట్రల్ బ్యాంకులు ఇప్పటిలానే కీలక వడ్డీ రేట్లను తక్కువగానే ఉంచితే, 2025లోనూ బంగారం మంచి పనితీరు కనబరిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
"2025లో బంగారం ఔట్లుక్ బాగానే ఉంది. కానీ 2024తో పోలిస్తే బంగారం వృద్ధి రేటు కాస్త మితంగానే ఉండవచ్చు. కానీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇలానే కొనసాగినా, లేక మరింత తీవ్రరూపం దాల్చినా, కొత్త ఏడాదిలో బంగారం ధరలు రూ.85,000 నుంచి రూ.90,000 వరకు పెరగవచ్చు. వెండి ధరలు కూడా రూ.1.1లక్షల నుంచి రూ.1.25 లక్షల వరకు పెరిగే ఛాన్స్ ఉంది."
- జతిన్ త్రివేది, ఎల్కేపీ సెక్యూరిటీస్ వీపీ రీసెర్చ్ అనలిస్ట్(కమొడిటీ అండ్ కరెన్సీ)
ఇవి కూడా ప్రభావం చూపించవచ్చు!
కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లను పెంచడం, తగ్గించడం చేస్తుంటాయి. ఒక వేళ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే, మార్కెట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. ఫలితంగా యూఎస్ డాలర్ బలహీనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంటుందని జతిన్ త్రివేది అన్నారు. ఒక వేళ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచితే, బంగారం ధరలు పడిపోయేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు.
ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం చాలా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నాయి. పెట్టుబడుల విషయంలో వైవిధ్యీకరణ వ్యూహాలను అనుసరిస్తున్నాయి. పైగా ఇప్పుడు కరెన్సీల స్థిరత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉన్నాయి. కనుక బులియన్ మార్కెట్‌కు ఇవన్నీ కలిసి వస్తాయని త్రివేది చెబుతున్నారు.
2024లో బంగారానికి రెక్కలు రావడానికి కారణం ఇదే!
'2024లో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాల వల్ల ప్రపంచ భయం గుప్పిట్లోకి పోయింది. దీనితో మదుపరులు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం, వెండి వైపు మొగ్గుచూపారు.' అని త్రివేది వివరించారు.
అయితే 'భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయని, అందువల్ల ఇప్పుడు బంగారం, వెండి ధరల పెరుగుదల కాస్త నెమ్మదించింది' అని కమెట్రెండ్జ్ రీసెర్చ్ సహవ్యవస్థాపకుడు, ఈసీఓ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ తెలిపారు.
అంతా ట్రంప్ చేతిలోనే ఉంది!
'అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కొత్త సంవత్సరంలో అధికారం చేపట్టనున్నారు. ఆయన ఇప్పటికే పలు దేశాలపై దిగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కనుక మే తరువాత ఫెడ్ కీలక వడ్డీ రేట్లలో కోత పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇవన్నీ బులియన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది' అని జ్ఞానశేఖర్ విశ్లేషించారు.
'2025 మొదటి అర్ధభాగంలో బంగారం ఔట్లుక్ బేరిష్‌గా ఉంది. అంటే బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. బహుశా ఔన్స్ బంగారం ధర 2,455కు (ఎంసీఎక్స్ : రూ.73,000 - రూ.73,500) వరకు పడిపోయే అవకాశం ఉంది' అని జ్ఞానశేఖర్ అభిప్రాయపడ్డారు.