Gold Investment Tips For Women :పెట్టుబడి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రంతో పాటు దీర్ఘకాలిక భద్రతను అందిస్తుంది. పైగా ఇది మహిళా సాధికారతకు దారితీస్తుంది. అంతేకాకుండా కుటుంబానికి అవసరమైన సంపదను సృష్టిస్తుంది. బంగారంలో పెట్టుబడి ఆర్థిక నష్టాల నుంచి, ద్రవ్యోల్బణ ప్రమాదాల నుంచి మీకు రక్షణ కల్పిస్తుంది. అయితే ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి పెట్టడం అనేది చాలా కీలకం అని గుర్తుంచుకోవాలి.
పెట్టుబడుల విషయానికి వస్తే, మహిళలు సరైన పెట్టుబడి మార్గాన్ని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. ఎఫ్డీ, బంగారం, బాండ్లు లాంటి వివిధ రకాల స్థిరమైన పెట్టుబడులను ఎంచుకోవచ్చు. కాస్త రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నవారు మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ షేర్స్ లాంటి పెట్టుబడులను కూడా ఎంచుకోవచ్చు. ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులకు నష్టభయం ఎక్కువగా ఉంటుంది.
రిస్క్ లేని పెట్టుబడి
బంగారం స్పష్టమైన విలువ గల ఒక ఆస్తి. ఇతర ఆస్తుల మాదిరిగా అధిక తరుగుదల లేదా అస్థిరత ఉండదు. బంగారంలో పెట్టుబడి పెట్టడం వలన ఆర్థిక భద్రత చేకూరుతుంది. పైగా ఆర్థిక నష్టాలు వచ్చినప్పుడు, మీ బంగారం కుటుంబానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. అదే సమయంలో సులభంగా డబ్బును చేసుకోవడానికి (లిక్విడిటీ) వీలవుతుంది. ద్రవ్యోల్బణం నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.
భౌతిక బంగారం Vs డిజిటల్ బంగారం
చాలా మంది కాయిన్స్ లేదా కడ్డీలు లాంటి భౌతిక బంగారంలో పెట్టుబడులు పెడుతుంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారమే. ఇలాంటి భౌతిక బంగారం ఇంట్లో ఉన్నప్పుడు, అవసరమైన సందర్బాల్లో అది మనకు అక్కరకు వస్తుంది. బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు చేసుకోవడానికి వీలవుతుంది. లేదా బ్యాంక్‌లో కుదువపెట్టి, తక్కువ వడ్డీకే సులభంగా రుణం తీసుకోవడానికి వీలవుతుంది. పైగా కాలం గడిచిన కొలదీ మీ బంగారం విలువ పెరుగుతుంది. అయితే ఆధునిక కాలంలో భౌతిక బంగారంతోపాటు డిజిటల్ బంగారంపైనా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కలుగుతోంది. దీని వల్ల దొంగలభయం ఉండదు. భౌతికంగా వాటికి కాపాలా ఉండాల్సిన అవసరం ఉండదు. పైగా మార్కెట్‌కు అనుగుణంగా దానిపై వడ్డీ రూపంలో ఆదాయం కూడా వస్తుంది.
చూశారుగా, మరి మీరు కూడా బంగారంపై పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం ఉన్న టాప్-3 గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సావరిన్ గోల్డ్ బాండ్లు
Sovereign Gold Bonds : ప్రభుత్వం జారీచేసిన ఈ బాండ్లు బంగారం అంతర్లీన విలువను కలిగి ఉంటాయి. పైగా వీటిపై ప్రభుత్వ హామీతో రాబడి కూడా వస్తుంది. ఇది ప్రభుత్వ పథకం కనుక ఎలాంటి రిస్క్ ఉండదు. 8 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో కనిష్ఠంగా 1గ్రాము నుంచి 20కేజీల వరకు వాటి నామమాత్రపు విలువపై సంవత్సరానికి 2.5% ఫిక్సడ్ రేటుతో వడ్డీని పొందవచ్చు. ఈ గోల్డ్ బాండ్ల సర్టిఫికెట్‌ను భౌతిక బంగారంగానూ మార్చుకోవచ్చు.
గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్
Gold Exchange Traded Funds : ఇవి బంగారం ధరను ట్రాక్ చేసే మ్యూచువల్ ఫండ్స్. దీనిలో అధిక లిక్విడిటీ సౌకర్యం ఉంటుంది. కనుక మీకు నచ్చినప్పుడు వీటిని అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో సులభంగా కొనుగోలు, అమ్మకాలు జరపవచ్చు. దాచుకోవడం, భద్రతా సమస్యలు లాంటివి ఉండవు. అయినప్పటికీ సావరిన్ గోల్డ్ బాండ్ల వలె రాబడికి గ్యారంటీ ఉండదు. బంగారం ధరలో మార్పులను ఆధారంగా చేసుకొని వీటి విలువలో మార్పులు జరుగుతాయి. అంటే రిస్క్, రివార్డ్ రెండూ అధికంగానే ఉంటాయి.
డిజిటల్ గోల్డ్
Digital Gold :ఆన్లైన్లో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. దీనినే డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సిప్ విధానంలో రూ.500 నుంచి ఎంత పెద్ద మొత్తమైనా పెట్టి డిజిటల్ గోల్డ్ కొనవచ్చు. EMI పద్ధతిలో చాలా చిన్న పరిణామాలలో కూడా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఈ పద్ధతిలో సులభంగా ఫిజికల్ గోల్డ్‌ను లిక్విడేట్ చేయడానికి వీలుంటుంది. బంగారం కొనాలనుకునే మహిళలు సురక్షితమైన ప్లాట్‌ఫామ్స్ ద్వారా డిజిటల్ గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే డిజిటల్ బంగారం భద్రత అనేది, మనం ఎంచుకునే ప్లాట్‌ఫామ్ విశ్వనీయత మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌లు నిల్వ ఛార్జీలను కూడా వసూలు చేస్తుంటాయి. అయితే ఈ ఛార్జీలు చాలా నామమాత్రంగా ఉంటాయి. అలాగే ఈ డిజిటల్ గోల్డ్‌పై సంపాదించే రాబడికి పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
నోట్ :మహిళలు ఎలాంటి పెట్టుబడులు పెడుతున్నా, ముందుగా వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. లాభ, నష్టాలను బేరీజు వేసుకోవాలి. ఒక వేళ మీకు దీనిపై సరైన అవగాహన లేకపోతే, మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
మీరు టూ-వీలర్స్ నడుపుతుంటారా? ఈ టాప్-10 రోడ్ సేఫ్టీ టిప్స్ మీ కోసమే! - Road Safety Tips For Bike Riders
రహస్యంగా వివాహం చేసుకున్న జొమాటో సీఈఓ - పెళ్లి కూతురు ఎవరంటే? - Zomato CEO Deepinder Goyal marriage