Gautam Adani Salary 2024 :అదానీ గ్రూప్ ఛైర్మన్, దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ రూ.9.26 కోట్ల జీతం తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరానికి( 2023-2024) ఈ జీతాన్ని ఆయన పొందారు. ఈ శాలరీ ఆయన కంపెనీలో పనిచేసే ముఖ్య ఉద్యోగులు, ఇతర వ్యాపారవేత్తలతో పోల్చితే చాలా తక్కువ. పదుల కొద్ది రంగాల్లో కంపెనీలు కలిగిన గౌతమ్ అదానీ, పోర్ట్, ఎనర్జీ రంగాల నుంచి మాత్రమే జీతం తీసుకున్నారు.
ఏయే కంపెనీల నుంచి ఎంత శాలరీ ఎంతంటే?
అదానీ ఎంటర్ప్రైజెస్ నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గౌతమ్ అదానీ రూ.2.19 కోట్ల వార్షిక వేతనం, రూ.27 లక్షల విలువైన అలవెన్సులు పొందారు. అంటే మొత్తం 2.46 కోట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అదానీ ఎంటర్ ప్రైజెస్ నుంచి గౌతమ్ అదానీ పొందిన శాలరీ 3శాతం ఎక్కువ. అదానీ పోర్ట్స్ నుంచి రూ.6.8 కోట్లను వేతనంగా తీసుకున్నారు.
ఆ వ్యాపారవేత్తలతో పోలిస్తే చాలా తక్కువ శాలరీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కొవిడ్ ముగిసిన తర్వాత నుంచి జీతం తీసుకోవడం లేదు. అంతకుముందు ఆయన రూ.15 కోట్ల వార్షిక వేతనాన్ని తీసుకునేవారు. భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ భారతీ మిత్తల్ 2022లో రూ. 16.7 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకున్నారు. రాజీవ్ బజాజ్ రూ.53.7 కోట్లు, పవన్ ముంజాల్ రూ.80 కోట్లు, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణియన్, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ ఎస్ పరేఖ్ కూడా గౌతమ్ అదానీ కంటే ఎక్కువ వార్షిక వేతనాన్ని తీసుకుంటున్నారు.
గౌతమ్ అదానీ తమ్ముడు, కుమారుడు శాలరీ
గౌతమ్ అదానీ తమ్ముడు రాజేశ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(ఏఈఎల్) నుంచి రూ.8.37 కోట్లు, ఆయన మేనల్లుడు ప్రణవ్ అదానీ రూ.6.46 కోట్ల వార్షిక వేతనాన్ని పొందినట్లు కంపెనీ వార్షిక నివేదికలో తేలింది. గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ రూ. 3.9 కోట్ల జీతాన్ని తీసుకున్నారు.