తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ తప్పులు అస్సలు చేయవద్దు!

Financial Mistakes To Avoid When Starting A New Job :మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా? జీవితంలో ఆర్థికంగా ఎదగాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. సొంతిల్లు, వాహనం, వివాహం, పిల్లల ఖర్చులు, పదవీ విరమణ లాంటి పెద్ద పెద్ద ఆర్థిక లక్ష్యాలను నేరవేర్చుకోవడం కోసం నిధులను ఏ విధంగా సమకూర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

money mistakes to avoid when starting a new job
Financial mistakes to avoid when starting a new job

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 11:57 AM IST

Financial Mistakes To Avoid When Starting A New Job :ఉద్యోగం సంపాదించడం అనేది జీవితంలో ఒక గొప్ప మైలురాయి అని చెప్పుకోవచ్చు. దీని వల్ల ప్రతి నెలా నిర్దిష్ట మొత్తంలో జీతం చేతికి అందుతుంది. ఫలితంగా ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. అయితే చాలా మంది డబ్బులు రాగానే, ఏమీ ఆలోచించకుండా, ఇష్టారీతిన డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. కానీ ఇది సరైన విధానం కాదని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ఆర్థికంగా పైకి ఎదగాలంటే, కచ్చితంగా పక్కా ప్రణాళిక వేసుకోవాలి. లేదంటే మనకు తెలియకుండానే, కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి. దీనితో సొంత ఇళ్లు, వాహనం, వివాహం, పదవీ విరమణ లాంటి పెద్ద పెద్ద లక్ష్యాల కోసం నిధులను సమకూర్చుకోవడం కష్టమవుతుంది.

బడ్జెట్​ను నిర్లక్ష్యం చేయవద్దు!
కొత్తగా ఉద్యోగంలో చేరినవారు సరైన బడ్జెట్​ను రూపొందించుకోరు. ఇది వారు చేసే మొదటి తప్పు. ఇలాంటి వారు ఆదాయ, వ్యయాలపై స్పష్టమైన అవగాహన లేకుండా, అతిగా ఖర్చులు చేస్తుంటారు. తరువాత ఆర్థికంగా ఇబ్బందిపడుతూ ఉంటారు. అందువల్ల మీ వేతనం, అదనపు ఆదాయ వనరులను లెక్కవేసుకోండి. మీ నెలవారీగా ఖర్చుల జాబితాను సిద్ధం చేసుకోండి. ఇలా బడ్జెట్​ను రూపొందించుకుంటే, ఆర్థిక వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి వీలవుతుంది.

పొదుపు చేయాల్సిందే!
చాలా మంది ఉద్యోగంలో చేరిన తరువాత కూడా పొదుపు విషయాన్ని పట్టించుకోరు. ఇది రెండో తప్పు. మీకు వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని పొదుపు చేయాల్సిందే. అలాగే అత్యవసర నిధిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. పదవీ విరమణ నిధి కోసం మరికొంత పొదుపు, మదుపు చేయాలి.

హెచ్చులకు పోకూడదు!
ఉద్యోగంలో చేరిన తరువాత కొంత మంది లేనిపోని హంగూ, ఆర్భాటాలకు పోతుంటారు. లైఫ్​స్టైల్ అప్​గ్రేడ్​ చేసుకోవాలనే తాపత్రయంతో లేనిపోని అనవసర ఖర్చులు చేస్తుంటారు. ముఖ్యంగా తరచూ రెస్టారెంట్లకు వెళ్లడం, గ్యాడ్జెట్లు కొనడం, లగ్జరీ అపార్ట్​మెంట్లలో ఉండడం లాంటివి చేస్తుంటారు. దీనితో వారి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. దీని వల్ల వారి పొదుపు అనేది బాగా తగ్గిపోతుంది. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు సాధించడం కష్టమవుతుంది. అందుకే తాత్కాలిక కోరికలను నెరవేర్చుకోవడం కంటే, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పొదుపు చేయాలి.

అప్పులు తీర్చేయాలి!
ఉద్యోగం రాకముందు చదువుల కోసం, ఇంటి అవసరాల కోసం చాలా అప్పులు చేసి ఉంటాం. ఉద్యోగం వచ్చిన తరువాత వీటిని వీలైనంత త్వరగా తీర్చేయాలి. కానీ చాలా మంది ఈ రుణాలను తీర్చే విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని వల్ల వడ్డీల భారం విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు దెబ్బతింటాయి. అందుకే మీ ఆదాయంలోని కొంత భాగాన్ని రుణ చెల్లింపుల కోసం పక్కన పెట్టాలి. అధిక వడ్డీ రుణాలను ముందుగానే తీర్చేయాలి.

ఇన్సూరెన్స్ చేయాల్సిందే!
చాలా మంది ఉద్యోగంలో చేరిన తరువాత ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను విస్మరిస్తూ ఉంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. జీవిత బీమా, ఆరోగ్య బీమా చేసుకోవడం తప్పనిసరి. ప్రమాదాలు, ఊహించని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇవి మీకు, మీ కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తాయి. అందువల్ల ఉద్యోగంలో చేరిన తరువాత కచ్చితంగా జీవిత, ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవాలి.

టాక్స్ సేవ్ చేయాలంటే?
మీ ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి పన్ను ప్రణాళిక వేసుకోవాలి. కానీ చాలా మంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మీ ఆదాయం, పెట్టుబడులపై ప్రభుత్వం ఎంత మేరకు పన్నులు విధిస్తోందో తెలుసుకోవాలి. పన్ను చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రావిడెంట్ ఫండ్, మ్యూచువల్ ఫండ్స్​, బీమా పాలసీలపై ఏ మేరకు పన్ను ఆదా అవుతుందో తెలుసుకోవాలి. అప్పుడే మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి.

జీవితం ఆర్థికంగా బాగుండాలంటే, పటిష్టమైన ప్రణాళిక, వివేకవంతమైన ఆర్థిక నిర్వహణ, క్రమశిక్షణ అవసరం. అప్పుడే మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరి, జీవితం బంగారుబాట అవుతుంది.

మహిళగా మీరు ఆర్థిక స్వేచ్ఛ సాధించాలా? ఈ బెస్ట్​ టిప్స్ మీ కోసమే!

రూ.70,000 బడ్జెట్లో మంచి బైక్​ కొనాలా? ఈ టాప్​-5 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

ABOUT THE AUTHOR

...view details