Financial Lessons From IPL :భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజే వేరు. అందులో ఐపీఎల్ వచ్చిందంటే చాలు ప్రేక్షకులు టీవీ, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు. అయితే ఐపీఎల్‌ను క్రికెట్ లాగే కాకుండా మంచి ఆర్థిక పాఠాలు నేర్పే గురువుగా భావించవచ్చట. అదేలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బ్యాటింగ్ చేసే జట్టు మ్యాచ్‌లో ముందంజలో ఉండాలంటే పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేయడం చాలా ముఖ్యం. అదేవిధంగా కెరీర్ ప్రారంభంలో పెట్టిన పెట్టుబడులు కూడా మీ ఆర్థిక విజయంలో బాగా సహాయపడతాయి. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో క్రికెట్ టీమ్ ఎలా పటిష్ఠంగా ఉంటుందో, మీరు పెట్టుబడులను సైతం అలాగే స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. టీమ్‌కు మంచి కోచ్ ఎలాగో, మీ ఆర్థిక విజయావకాశాలను పెంచుకోవడానికి మంచి ఆర్థిక సలహాదారు అవసరం.
క్రికెట్ నేర్పే ఆర్థిక పాఠాలు
టీ20 మ్యాచ్ పవర్ ప్లేలో(మొదటి ఆరు ఓవర్లలో) 30 యార్డ్ సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. ఇది బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలం. ఎందుకంటే 30 యార్డ్ సర్కిల్ బయటకు కొట్టినా ఇద్దరు ఫీల్డర్లు ఉండడం వల్ల భారీగా పరుగులు వస్తాయి. అవుట్ అయ్యే రిస్క్ కూడా తక్కువ. పవర్ ప్లేలో రిస్క్ తీసుకోవడం వల్ల టీమ్ మంచి స్కోర్ సాధిస్తుంది. గేమ్‌లో బ్యాటింగ్ జట్టు ముందంజలో ఉంటుంది.
అదేవిధంగా మీరు పెట్టుబడులను ముందుగా ప్రారంభించడం మంచిది. అప్పుడే మీకు ఆర్థిక ప్రయోజనాలు వేగంగా అందుతాయి. అంతేకాకుండా కెరీర్ ప్రారంభంలో ఆర్థిక కట్టుబాట్లు తక్కువగా ఉంటాయి. పొదుపు, పెట్టుబడులను అలవాటు చేసుకోవడానికి ఇదే మంచి సమయం కూడా. అయితే రిస్క్ తీసుకోవడం ముఖ్యమే కానీ బాగా ప్లాన్ చేసుకోవాలి. అనవసరమైన రిస్క్‌లు తీసుకోవడం వల్ల బ్యాటర్ ఎలా అవుట్ అవుతాడో అలాగే మీ పెట్టుబడులు దెబ్బతింటాయి.
పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇలా!
ఒక బ్యాటర్ ఒక ఏడాది ఎక్కువ పరుగులు చేసినా, బౌలర్ ఎక్కువ వికెట్లు తీసినా వచ్చే సంవత్సరం కూడా అదే ప్రదర్శన పునరావృతం చేస్తాడని కచ్చితంగా చెప్పలేం. మీ పెట్టుబడులకు, ముఖ్యంగా ఈక్విటీలో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విషయాన్నే తీసుకుందాం. వాల్యూ రీసెర్చ్ ప్రకారం 2024 ఏప్రిల్ వరకు స్మాల్ క్యాప్‌లు 6.44 శాతం రాబడిని అందించగా, గతేడాది 57.73 శాతం రాబడిని ఇచ్చింది. ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే ఒక మంచి ప్లేయర్ కొన్ని ఐపీఎల్ సీజన్లలో ఫెయిల్ అవ్వొచ్చు. అలాగే పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.