Financial Changes From Oct 1st 2024 : ఈ అక్టోబర్ 1 నుంచి పలు బ్యాంకింగ్, ట్యాక్స్ రూల్స్ మారనున్నాయి. ఇవి మీ పెట్టుబడులపై, బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్
పోస్ట్ ఆఫీస్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై)తో సహా చిన్న పొదుపు ఖాతాలకు సంబంధించిన పలు కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇవి మీ పొదుపును ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ రూల్స్
ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఖాతాదారుల కోసం రెండు కొత్త డెబిట్ కార్డ్ బెనిఫిట్స్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, అక్టోబర్ 1 నుంచి ఒక త్రైమాసికంలో రూ.10,000 కనుక ఖర్చు చేస్తే, తరువాతి మూడు నెలల్లో 2 కాంప్లిమెంటర్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ను పొందవచ్చు. ఉదాహరణకు మీరు జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో మీ ఐసీఐసీఐ డెబిట్ కార్డ్ ఉపయోగించి రూ.10,000 ఖర్చు చేశారని అనుకుందాం. అప్పుడు అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో మీరు 2 సార్లు ఉచితంగా ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ - క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. దీని ప్రకారం, ఇకపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో ఒక్కసారి మాత్రమే యాపిల్ ప్రొడక్టులు కోసం రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకోగలుగుతారు. దీనితో పాటు తనిష్క్ వోచర్ల రిడీమ్‌పై కూడా క్యాప్ పెట్టింది. అంటే ఇకపై ప్రతి త్రైమాసికంలో 50,000 రివార్డ్ పాయింట్లను మాత్రమే తనిష్క్ వోచర్ల కింద రిడీమ్ చేసుకోవడానికి వీలవుతుంది.