Fastag New Rules From February 17:దేశంలో టోల్ చెల్లింపుల కోసం భారత ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. టోల్ ప్లాజాల వద్ద రద్దీ, జాప్యాన్ని తగ్గించటంతోపాటు ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. తాజాగా ఫాస్టాగ్ వినియోగిస్తున్న వాహనదారులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. దీనిప్రకారం మీ ఫాస్టాగ్ ఓసారి చెక్ చేసుకోవడం బెటర్. లేదంటే టోల్ ప్లాజావద్దకు వెళ్లి ఇబ్బందులు పడడమే కాదు, డబుల్ ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది! ఫిబ్రవరి 17వ తేదీ నుంచే కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. మరి, ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టోల్ రోడ్స్‌పై టోల్ వసూలు కోసం ఉద్దేశించిన ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఫాస్టాగ్ వినియోగదారులకు కొత్తగా 70 నిమిషాల వ్యవధిని నిర్దేశించింది. నిర్దేశిత సమయంలో బ్లాక్‌లిస్ట్‌లోంచి వైదొలగడంలో విఫలమైతే డబుల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ జనవరి 28నే ఓ సర్క్యులర్ జారీ చేసింది.
ఫాస్టాగ్‌లో తగిన బ్యాలెన్స్ లేకపోతే ఆ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్‌లోకి వెళుతుంది. టోల్‌ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్టాగ్ ఇన్‌యాక్టివ్‌లో ఉంటే కోడ్ 176 ఎర్రర్‌ను చూపి ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేస్తారు. అలాగే, స్కాన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లినా ఇదే కారణంతో లావాదేవీని తిరస్కరిస్తారు. ఇలాంటి సందర్భంలో పెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క బ్యాలెన్స్ మాత్రమే కాదు.. కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం, ఛాసిస్ నంబర్‌కు, వెహికల్ నంబర్‌కు మధ్య పొంతన లేకపోవడం వంటి కారణాలతో ఫాస్టాగ్ కూడా బ్లాక్‌లిస్ట్‌లోకి వెళుతుంది.