Family Cash Transactions Tax Implications :సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి. లేదా ఏవైనా గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంటుంది. అయితే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగే ఇలాంటి నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను చెల్లించాలా? ఐటీ చట్టంలో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? లేదా జరిమానా పడే అవకాశం ఉందా? ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పరిమితి మించితే ట్యాక్స్ చెల్లించాల్సిందే!
గృహ అవసరాల కోసం డబ్బును అందించడం లేదా కుటుంబ సభ్యలకు బహుమతులు ఇవ్వడం లాంటివి సాధారణమే. అయితే కుటుంబ సభ్యుల విషయంలో మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే లావాదేవీలపై ఆదాయపు పన్ను ఉండదు. అలాంటి వారు ఆదాయపు పన్నుశాఖ నోటీసులకు లోబడి ఉండరు. అయితే, భర్త లేదా భార్య ఇచ్చిన డబ్బులను, వారి జీవితభాగస్వామి వేరొక ఆదాయం వచ్చే మార్గంలో పెట్టుబడితే, వాటిపై వచ్చే రాబడిపై కచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
సెక్షన్ 269SS, 269T ఏం చెబుతున్నాయి?
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269SS , 269T ప్రకారం రూ.20 వేలకు మించిన నగదు లావాదేవీలపై జరిమానా విధిస్తారు. నగదు లావాదేవీలను తగ్గించడానికే ప్రభుత్వం ఇలాంటి పన్ను నిబంధనలను తీసుకువచ్చింది. అయితే కుటుంబ సభ్యులు రూ.20 వేలకు మంచి నగదు లావాదేవీలు జరిపినా, వారిపై ఎలాంటి జరిమానాలు విధించరు. ఎందుకంటే, కుటుంబ సభ్యుల మధ్య జరిగే నగదు లావాదేవీలకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. ముఖ్యంగా తండ్రీ-కొడుకు, భార్య-భర్తలతో సహా సన్నిహిత కుటుంబ సభ్యుల మధ్య జరిగే నగదు లావాదేవీలు ఈ మినహాయింపుల పరిధిలోకి వస్తాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, సాధారణ కుటుంబ లావాదేవీలకు పెనాల్టీలు ఉండవని ఐటీ చట్టంలోని ఈ సెక్షన్లు చెబుతున్నాయి.