Factors To Keep In Mind While Buying Property :ఆస్తులు కొనేటప్పుడు 'రిజిస్ట్రేషన్' చేసుకోవడం తప్పనిసరి. అందుకే అందరూ స్టాంప్ కాగితాల మీద రాసిన దస్తావేజును రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. తరువాత తమకు సర్వ హక్కులు వచ్చినట్టు భావిస్తారు. అయితే నిజంగానే దీనికి తిరుగులేదా? ఒక్కసారి ఆస్తి మీ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదా? అనేది తెలుసుకుందాం.
1. న్యాయపరమైన చిక్కులు
ఆస్తి కొనడం, దాన్ని మన పేరు మీదకి మార్పించుకోవడమనేది అనుకున్నంత తేలికైన వ్యవహారం కాదు. న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పుడు కానీ తెలియదు అందులో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో!
మీ పేరున రిజిస్టర్ అయిన స్థలం, మరొకరి పేరుపై కూడా రిజిస్టర్ అయ్యుండవచ్చు. లేదా మీ స్థలాన్ని ఇతరులు కబ్జా చేయవచ్చు. లేదా ఆ స్థలంతో ఏమాత్రం సంబంధంలేని వ్యక్తులు మీపై దావా వేయవచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు వ్యవస్థను నిందించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే ఆస్తి కొనేటప్పుడే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
2. అమ్మేవారికి అన్ని హక్కులు ఉన్నాయా?
ఆస్తులు కొనాలనుకునే చాలా మంది సదరు స్థలం/ ప్లాట్ధర గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ అమ్మేవారి హక్కుల గురించి తెలుసుకోరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అధిక ధర పెట్టి కొన్నంత మాత్రాన ఆ ఆస్తి మనకు సొంతం అయిపోతుందని చెప్పలేం. ఇందుకంటే, చాలా సార్లు ఆస్తులపై తగిన హక్కులు లేనివారు, మోసపూరితంగా ఇతరులకు వాటిని అమ్మేస్తుంటారు. అందుకే అమ్మేవారికి సదరు ఆస్తిపై పూర్తి హక్కులు ఉన్నాయో, లేదో ముందుగానే తెలుసుకోవాలి.
3. అమ్మే హక్కు ఉందా?
ఏ ఆస్తి అయినా కొనే ముందు, అమ్మే వారికి అన్ని హక్కులు ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని ప్రశ్నలు వేయాలి. అవి ఏమిటంటే?
- అమ్ముతున్న వారికి సదరు ఆస్తి ఎలా వచ్చింది?
- వారసత్వం అయితే వారసులు అందరూ సంతకాలు పెడుతున్నారా?
- మైనర్లు ఉంటే కోర్టు అనుమతి తీసుకున్నారా?
- తండ్రి/తల్లి/ సంరక్షకులు తమ అధికార పరిధిలోనే వ్యవహరిస్తున్నారా?
- ఇతర హామీలు ఏవైనా ఇస్తారా?
- అసలు యజమాని నుంచి అమ్మేవారికి హక్కులు సరిగ్గానే సంక్రమించాయా?
- అమ్మేవాళ్లు చూపించిన రిజిస్టర్డ్ దస్తావేజులు సరైనవేనా?
- సదరు ఆస్తిని ఎక్కడైనా తనఖా పెట్టారా?
- ఆస్తి ఇంతకు ముందే ఎవరికైనా అమ్మరా?
- ప్రభుత్వం/ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తా? లేదా ప్రభుత్వ సంస్థలు ఆ భూమిని తీసుకునే అవకాశం ఉందా?
- సదరు ఆస్తిపై ఏమైనా దావాలు, తగాదాలు ఉన్నాయా?
- నిర్మాణాలకు, ఇళ్ల స్థలాలకు సరైన అనుమతులు ఉన్నాయా?
- ఆస్తులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి?
ఇలాంటి అనేక విషయాలు కచ్చితంగా వాకబు చేయాలి. ఎలాంటి మొహమాటం లేకుండా సదరు ఆస్తికి సంబంధించిన అన్ని పత్రాలను అడగి చూడాలి. వాటిని అనుభవజ్ఞులైన న్యాయవాదులకు చూపించి, తగిన సలహాలు తీసుకోవాలి. ఆ తరువాతనే సదరు ఆస్తి కొనాలా? లేదా? అనేది నిర్ణయించుకోవాలి. కొనాలనుకుంటే, సరైన రైటర్తో దస్తావేజును రాయించుకోవాలి.
4. సమస్యలేమీ ఉండవా?
ఆస్తుల కొనుగోలు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, సమస్యలు ఏమీ రావని కచ్చితంగా చెప్పడానికి వీలుండదు. కాకపోతే అనవసర సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. పైగా చట్టం మీకు అదనపు రక్షణ కల్పిస్తుంది. అంటే, మీరు సొమ్ము చెల్లించి ఆస్తి కొన్నారు కాబట్టి, నిజాయతీగా ఆస్తి పొందిన వ్యక్తిగా మిమ్మల్ని న్యాయస్థానాలు పరిగణిస్తాయి. మీ హక్కులను కాపాడతాయి.
5. అది ఎప్పుడంటే?
- మీరు కచ్చితంగా డబ్బు లేదా ప్రతిఫలం ఇచ్చి ఆస్తి పొందినవారు అయ్యుండాలి.
- ఆస్తిపై ఇతరులకు ఉన్న హక్కులు గురించి మీకు తెలిసి ఉండకూడదు.