Engine Warning Signs : కారు కొనుగోలు చేసిన కొత్తలో చాలా బాగా చూసుకుంటారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత కనీసం టైమ్‌కు సర్వీసింగ్ కూడా చేయించరు. ఇలా అజాగ్రత్తగా ఉండటం వల్లే.. కారు లైఫ్‌టైమ్ తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కారులో ఏవైనా రిపేర్‌లు వచ్చినప్పుడు మనకు ఇంజిన్ నుంచి.. డ్యాష్‌బోర్డ్ నుంచి కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయని.. వెంటనే అలర్ట్ కావాలని చెబుతున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. మరి.. కారులో వచ్చే ఆ వార్నింగ్ సైన్స్ ఏంటో మీకు తెలుసా??
వార్నింగ్ సిగ్నల్స్ :
సాధారణంగా ప్రతి కారులో ఉండే డ్యాష్‌బోర్డులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై ఏదైనా సమస్యలు ఉంటే వార్నింగ్ సైన్స్ కనిపిస్తూనే ఉంటాయి. తప్పకుండా డ్రైవర్ వాటిని గుర్తించి.. సరిచేయాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే కారు తొందరగా పాడైపోతుంది. ఇంకా ప్రత్యేకించి.. ఇంజిన్ విషయంలో వచ్చే వార్నింగ్ సైన్స్‌ను పట్టించుకోకుండా ఉంటే అది చెడిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
చెక్ ఇంజన్ లైట్ :
దాదాపు అన్ని కార్లలో ఇంజిన్ క్లస్టర్‌పై 'చెక్ ఇంజన్ లైట్' ఉంటుంది. ఇంజిన్‌లో ఏదైనా సమస్య ఉన్నా.. అలాగే ఏవైనా పార్ట్స్, సెన్సార్ వంటివి పనిచేయకపోయినా.. డాష్‌బోర్డ్‌లో అలర్ట్ చేస్తుంది. అప్పుడు వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న హై మోడల్ కార్లు అత్యాధునిక డయాగ్నొస్టిక్ సెటప్‌ను కలిగి ఉన్నాయి. ఇవి ఎప్పటికప్పుడు అన్ని సిగ్నల్‌నూ డాష్‌బోర్డ్‌పై చూపిస్తుంటాయి.
సైలెన్సర్‌లో తెల్లటి పొగ :
సాధారణంగా చలికాలంలో కారు సైలెన్సర్ నుంచి చిన్నపాటి తెల్లటి పొగ వస్తుంటుంది. అయితే.. ఈ పొగ బ్లాక్ కలర్, బ్లూ కలర్‌లో అలాగే మందపాటి తెల్లటి పొగగా వస్తున్నట్లయితే ఇంజిన్‌లో లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. దీనికి కారణం ఇంజిన్‌కు ఇంధన సరఫరా సరిగ్గా జరగకపోవడం కావచ్చని నిపుణులు అంటున్నారు.
ఆగుతూ వెళ్తుంటే :
కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు అది స్మూత్‌గా వెళ్తోందా లేదా హార్డ్‌గా ముందుకు కదులుతోందా అనే విషయం మనకు అర్థం అవుతుంటుంది. అయితే.. కారు ఇంజిన్ ఎక్కువగా వైబ్రేట్ అవడం.. ఆగుతూ ఆగుతూ ముందుకు పోవటం, పికప్ తగ్గడం వంటివి కనిపిస్తే కారును వెంటనే మెకానిక్ వద్దకు తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. కారులో స్పార్క్ ప్లగ్ ఫౌల్స్, ఇగ్నిషన్ కాయిల్స్, ఎయిర్ ఫిల్టర్ వంటివి చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.