Elon Musk X Email :టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చిన మస్క్, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్ పేరుతోనే ఒక ఈ-మెయిల్ సర్వీసును తీసుకురానున్నట్లు మస్క్ ప్రకటించారు. ఎక్స్ మెయిల్ త్వరలో రాబోతోందని ఆయన స్వయంగా ప్రకటించారు. ఎక్స్ మెయిల్ రాకతో ఈ మెయిల్ సేవల ముఖచిత్రం మారబోతోందని మస్క్ అన్నారు.
ఎక్స్‌మెయిల్ ఎప్పుడు ప్రారంభం కానుంది? అని ఆ సంస్థలోని (X) ఇంజినీరింగ్ అండ్ సెక్యూరిటీ బృందానికి చెందిన నేట్ మెక్‌గ్రాడీ ఎక్స్ వేదికగా ఇటీవల ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఎలాన్ మస్క్ 'త్వరలో' అంటూ సమాధానమిచ్చారు. దీనిపై యూజర్ల నుంచి పలురకాల కామెంట్లు వస్తున్నాయి. జీ-మెయిల్‌పై నమ్మకం పోయిందని, ఎక్స్‌మెయిల్‌కు మారే సమయం ఆసన్నమైందని ఓ యూజర్ పేర్కొన్నాడు. మరొకరు జంక్ మెయిల్స్ కోసం హాట్‌మెయిల్స్ ఎలా వాడుతున్నానో జీ-మెయిల్‌నూ అలాగే వినియోగిస్తానని పోస్టు చేశాడు.
అయితే సొంత ఎక్స్ మెయిల్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారు, అందులోని ప్రత్యేకతలు ఏంటి అనే వివరాలను మస్క్ ఇంకా వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అందరూ వాడే గూగుల్‌కు చెందిన జీ-మెయిల్ త్వరలో తన సేవలను నిలిపివేయనుందన్న పుకార్ల మధ్య మస్క్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
జీ-మెయిల్‌పై గూగుల్ క్లారిటీ
అంతకుముందు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు వినియోగించే జీ మెయిల్ సేవలను గూగుల్ నిలిపివేయనుందన్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. 2024 ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి జీ మెయిల్ కనుమరుగు అవుతుందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. గూగుల్ ఈజ్ సన్‌సెట్టింగ్ జీ-మెయిల్ అంటూ గూగుల్ నుంచి వచ్చినట్టుగా చెబుతున్న మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ వైరలైంది. దీనిపై స్పందించిన గూగుల్, అవన్నీ శుద్ధ అబద్ధాలుగా పేర్కొంది. ఇన్నాళ్లూ బేసిక్ HMTL వ్యూ ఫార్మాట్‌లో జీమెయిల్ సేవలు అందించామని, ఈ సేవలను నిలిపేసి త్వరలోనే స్టాండర్డ్ వ్యూలో జీ-మెయిల్ సేవలను అధునాతనంగా అందిస్తామని గూగుల్ స్పష్టం చేసింది. తన వినియోగదారులకు భరోసా కల్పించేందుకు ఎక్స్ వేదికగానే గూగుల్ ట్వీట్ చేసింది.