Economic Survey 2024 :ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పైనే అందరి దృష్టి ఉంది. అనవాయితీ ప్రకారం, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఇది మధ్యంతర బడ్జెట్ కనుక మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆర్థిక సర్వే (Econimic Survey) ప్రవేశపెడుతుందా? లేదా? అనేది చూడాలి.
ఆర్థిక సర్వే అంటే ఏమిటి?
గత ఏడాది కాలంలోని దేశ ఆర్థికవ్యవస్థ పనితీరు గురించి, రానున్న సంవత్సర కాలంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్ల గురించి ముందుగా అంచనా వేసేదే ఆర్థిక సర్వే. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే ఈ ఎకనామిక్ సర్వేను ఆధారం చేసుకునే యూనియన్ బడ్జెట్‌ను రూపొందిస్తుంటారు.
సాధారణంగా కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సర్వే రూపొందుతుంది. ఈ సర్వే రానున్న రోజుల్లో దేశానికి ఎదురయ్యే సవాళ్లను ముందుగా అంచనా వేసి, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి పలు సూచనలు చేస్తుంది.
సర్వేలో ఏముంటుంది?
ఎకనమిక్ సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను స్పష్టంగా వివరిస్తుంది. కీలక రంగాలైన వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల గురించి తెలియజేస్తుంది. మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల లాంటి కీలక అంశాలను వివరిస్తుంది. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గురించి, ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల వస్తున్న ఫలితాలను కూడా విశ్లేషిస్తుంది. వచ్చే ఏడాది ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు గురించి, వాటిని ఎదుర్కొనే వ్యూహాలను గురించి కూడా తెలియజేస్తుంది. ఈ విధంగా ఇది బడ్జెట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తుంది.
బడ్జెట్‌కు ఆర్థిక సర్వేకు మధ్య ఉన్న తేడా ఏమిటి?
కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాల ద్వారా వస్తున్న రాబడులను, ఖర్చులను, ఆయా రంగాలకు చేసిన కేటాయింపులను మాత్రమే పేర్కొంటారు. కానీ ఆర్థిక సర్వేలో ప్రస్తుత సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు విశ్లేషణ, రానున్న రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు, చేపట్టాల్సిన సంస్కరణలను ప్రధానంగా విశ్లేషిస్తారు.