తెలంగాణ

telangana

ETV Bharat / business

పెళ్లి కానుకగా ఇచ్చిన బంగారాన్ని అమ్మితే ప్రభుత్వానికి ట్యాక్స్​ కట్టాలా? రూల్స్ ఏమి చెబుతున్నాయంటే? - GOLD SALE TAX IN INDIA

తల్లిదండ్రులు పెళ్లి కానుకగా ఇచ్చిన బంగారంపై పన్ను చెల్లించాలా? ఆదాయ పన్ను శ్లాబ్​లు ఎలా ఉన్నాయి?

Gold
Gold (IANS)

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 5:25 PM IST

Gold Sale Tax In India :మీ పెళ్లి సమయంలో పుట్టింటివాళ్లు ఇచ్చిన బంగారాన్ని అత్యవసరంగా అమ్మాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే.

భారతదేశంలో కానుకల రూపంలో పొందిన వాటిని వ్యక్తిగత ఆదాయంగా పరిగణించరు. కానీ ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి పొందిన కానుకల మొత్తం విలువ రూ.50,000 కంటే ఎక్కువ ఉంటే, వాటిపై కచ్చితంగా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందే. పెళ్లి కానుకల విషయంలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. దీనిని ఇంకా సింపుల్​గా చెప్పాలంటే, పెళ్లి సమయంలో చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ కానుకలు ఇస్తుంటారు. ఈ కానుకల అన్నింటి విలువ రూ.50,000 లోపు ఉంటే, మీరు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. ఒక వేళ ఈ కానుకలన్నింటి విలువ రూ.50,000కు మించితే, దానిని 'ఇతర మార్గాల ద్వారా పొందిన ఆదాయం' (Income From Other Sources) కింద పరిగణిస్తారు. కనుక ఆ మొత్తం కానుకల విలువ ఆధారంగా పన్ను విధిస్తారు.

పుట్టింటివారు ఇచ్చిన బంగారంపై పన్ను కట్టాలా?
ఆదాయ పన్ను నిమయాల్లో కానుకలకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ముఖ్యంగా ట్యాక్స్ నిబంధనల్లో పేర్కొన్న 'నిర్దిష్ట బంధువుల' నుంచి పొందిన కానుకలను, వాటి విలువ ఎంత ఉన్నప్పటికీ, వాటిని వక్తిగత ఆదాయంగా పరిగణించరు. ఈ నిర్దిష్ట బంధువుల లిస్ట్​లో తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కనుక తల్లిదండ్రుల నుంచి పొందిన బంగారాన్ని మీ వ్యక్తిగత ఆదాయంగా ప్రభుత్వం పరిగణించదు. కనుక మీపై ప్రభుత్వం ఎలాంటి పన్ను విధించదు. కానీ!!

బంగారం అమ్మితే పన్ను కట్టాల్సిందే!
తల్లిదండ్రులు ఇచ్చిన బంగారు ఆభరణాలు మీరు వాడుకున్నంత కాలం ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. కానీ మీరు వాటిని అమ్మాలనుకుంటే మాత్రం కచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే, బంగారం అమ్మితే వచ్చిన డబ్బును మూలధన లాభం(క్యాపిటల్ గెయిన్​)గా పరిగణిస్తారు. కాలవ్యవధిని అనుసరించి - స్వల్పకాలిక మూలధన లాభాలు, దీర్ఘకాలిక మూలధన లాభాలుగా వాటిని వర్గీకరిస్తారు. దీనిని సింపుల్​గా అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ చూద్దాం.

ఉదాహరణకు మీ తండ్రి బంగారం కొని, మీకు పెళ్లి కానుకగా ఇచ్చారనుకుందాం. మీ తండ్రి బంగారం కొన్నప్పటి నుంచి మీరు దానిని సేల్ చేసినంత వరకు మధ్య ఉన్న కాల వ్యవధి 24 నెలలలోపు ఉంటే, దానిని స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. దాని ప్రకారం పన్ను విధిస్తారు. ఒక వేళ మీ ఇద్దరి ఉమ్మడి హోల్డింగ్ పీరియడ్​ 24 నెలలకు మించి ఉంటే, దానిని దీర్ఘకాలిక మూలధన లాభంగా గుర్తించి, దాని ప్రకారం ట్యాక్స్​ విధిస్తారు. ప్రస్తుతం లాంగ్ టర్మ్​ క్యాపిటల్ గెయిన్స్​పై 12.50 శాతం ఫ్లాట్​ రేటుతో పన్ను విధిస్తున్నారు.

అయితే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్​ నుంచి ఇండెక్సేషన్​ తీసివేశారు. ఇది పన్ను చెల్లింపుదారులకు ఎంతో ఊరట కలిగించింది. ఎందుకంటే, ఇకపై మీరు బంగారం అమ్మకం ద్వారా పొందిన ఆదాయం నుంచి బంగారం కొన్న వెలను తీసివేయవచ్చు. దీని వల్ల చాలా వరకు మీపై పన్ను భారం తగ్గుతుంది.

నోట్ :మీరు కనుక 2001 ఏప్రిల్​ 1 కంటే ముందు బంగారం కొనుగోలు చేసినా, లేదా గిఫ్ట్​గా పొందినా, దాని మార్కెట్ విలువను 2001 ఏప్రిల్​ 1న ఉన్న ధరగానే తీసుకునే అవకాశం ఉంది. దీని వల్ల మీ దీర్ఘకాలిక మూలధన లాభాలపై చాలా పన్ను భారం తగ్గుతుంది.

నోట్ : ఈ ఆర్టికల్​లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

బంగారు ఆభరణాలు కొంటున్నారా? గోల్డ్ ప్యూరిటీ గురించి తెలుసుకోండిలా!

పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బంగారం కొనుగోలు చేస్తున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే మంచిది!

ABOUT THE AUTHOR

...view details