తెలంగాణ

telangana

ETV Bharat / business

తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నారా? 'క్రిటికల్ ఇల్​నెస్ ఇన్సూరెన్స్​'​తో రక్షణ పొందండిలా! - Critical Illness Insurance Benefits - CRITICAL ILLNESS INSURANCE BENEFITS

Critical Illness Insurance : అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. నేటి కాలంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాధారణ ఆరోగ్య బీమాతో ఈ వైద్య ఖర్చులు భరించలేము. తీవ్రమైన వ్యాధుల బారిన పడితే ఇక చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రతి ఒక్కరూ 'క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఇన్సూరెన్స్ పాలసీ' తీసుకోవాలి. అప్పుడే ఆర్థిక భరోసా లభిస్తుంది. పూర్తి వివరాలు మీ కోసం.

Critical Illness Insurance features
Critical Illness Insurance benefits (ETV BHARAT TELUGU TEAM)

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 3:09 PM IST

Critical Illness Insurance :నేటి కాలంలో ఎప్పుడు ఏ రూపంలో ఆరోగ్య సమస్యలు వస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఓవైపు వైద్య చికిత్స ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు తీవ్రమైన వ్యాధులు ప్రబలుతున్నాయి. కనుక కేవలం ఒక సాధారణ ఆరోగ్య బీమా పాలసీ ఉంటే సరిపోదు. తీవ్ర వ్యాధుల బారిన పడినప్పుడు, ఒకేసారి మొత్తం పరిహారం చెల్లించే 'క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఇన్సూరెన్స్​ పాలసీ'లను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు క్రిటికల్ ఇల్​నెల్​ పాలసీ ప్రయోజనాలు గురించి వివరంగా తెలుసుకుందాం.

ఆపదలో అండగా
ప్రాణాంతక వ్యాధులు సోకినప్పుడు దీర్ఘకాలిక చికిత్స అవసరం అవుతుంది. కనుక ఖర్చులు బాగా పెరుగుతాయి. గుండె జబ్బు, క్యాన్సర్‌, పక్షవాతం, అవయవ మార్పిడి, మూత్రపిండాల వైఫల్యం, మెదడు సమస్యలు - ఇలాంటి తీవ్రమైన వ్యాధులు చాలా ఉంటాయి. ఈ తరహా క్లిష్టమైన అనారోగ్య సమస్యలు వ్యక్తులపై, వారి కుటుంబాలపై శారీరక, మానసిక, ఆర్థిక ఒత్తిడిలను కలిగిస్తాయి. ఇలాంటి వారికి క్రిటికల్ ఇల్​నెస్​ పాలసీ అక్కరకు వస్తుంది. మిగతా విషయాల మాట ఎలా ఉన్నా, చికిత్సకు అవసరమైన డబ్బును అందించడంలో ఈ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలు చాలా ఉపయోగపడతాయి.

క్రిటికల్ ఇల్​నెస్​ పాలసీ అంటే?
ప్రాణాంతక వ్యాధుల చికిత్స ఖర్చులను అందించే పాలసీని 'క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఇన్సూరెన్స్​ పాలసీ' అంటారు. హాస్పిటల్​లో చేరి, చికిత్స చేయించుకుంటే, ఆరోగ్య బీమా పాలసీ ఆ ఖర్చులను చెల్లిస్తుంది. ఇందుకు భిన్నంగా తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు క్రిటికల్ ఇల్​నెస్​ ఇన్సూరెన్స్ అనేది ఒకేసారి మొత్తం పరిహారాన్ని అందిస్తుంది. అందుకే వీటిని 'ఫిక్స్‌డ్‌ బెనిఫిట్‌ పాలసీలు' అని పిలుస్తారు. బీమా తీసుకున్న వ్యక్తికి పాలసీలో పేర్కొన్న జాబితాలోని వ్యాధుల్లో ఏది వచ్చినా, దాని చికిత్సకు అయ్యే ఖర్చులను బీమా సంస్థ ఏకమొత్తంగా చెల్లిస్తుంది. దీనివల్ల పాలసీదారునికి, అతని లేదా ఆమె కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది.

కచ్చితంగా తీసుకోవడమే మేలు!
ఈ క్రిటికల్ ఇల్​నెస్​ పాలసీని వ్యక్తిగతంగా, జాయింట్​గా తీసుకోవచ్చు. అలాగే ఆరోగ్య, జీవిత బీమా పాలసీలతో పాటు, దీనిని రైడర్​గా కూడా యాడ్​ చేసుకోవచ్చు. కుటుంబంలో తీవ్రమైన వ్యాధుల చరిత్ర ఉన్నప్పుడు, ఈ పాలసీని తీసుకోవడం ఎంతో మంచిది. అయితే సాధ్యమైనంత వరకు ప్రత్యేక పాలసీగానే దీన్ని తీసుకోవాలి. ఒకవేళ దీనిని రైడర్‌గా తీసుకుంటే, ప్రాథమిక పాలసీకి ప్రీమియం చెల్లించడం ఆపేస్తే, ఇదీ కూడా రద్దవుతుంది. పైగా ప్రాథమిక పాలసీ విలువలో 30 శాతానికి మించి పరిహారం లభించకపోవచ్చు. విడిగా క్రిటికల్ ఇల్​నెస్​ పాలసీ తీసుకుంటే, తక్కువ ప్రీమియంతోనే అధిక మొత్తం పరిహారంగా పొందవచ్చు.

తీవ్ర వ్యాధుల జాబితా చూడాలి!
ఇన్సూరెన్స్ కంపెనీలను బట్టి తీవ్ర వ్యాధుల జాబితా మారుతుంటుంది. కొన్ని సంస్థలు 36 వరకు తీవ్ర వ్యాధులకు రక్షణ అందిస్తున్నాయి. మరికొన్ని 20, ఇంకొన్ని 12 రకాల తీవ్ర వ్యాధులకు పరిహారం ఇస్తున్నాయి. కవరయ్యే వ్యాధుల సంఖ్యను బట్టి ప్రీమియం రేట్లు ఉంటాయి. అయితే కేవలం ప్రీమియం తక్కువగా ఉందని క్రిటికల్ ఇల్​నెస్ పాలసీ తీసుకోకూడదు. కుటుంబంలో గతంలో ఎవరికైనా తీవ్రమైన వ్యాధులు ఉన్నాయా? మీరు ఎంచుకున్న పాలసీ వాటికి పరిహారం అందిస్తోందా? అనేది చూసుకోవాలి.

ఉదాహరణకు ఒక వ్యక్తికి ఆస్తమా వ్యాధి ఉందనుకుందాం. అప్పుడు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ జాబితాలో ఊపిరితిత్తులకు సంబంధించిన కవరేజీ ఉందా, లేదా అనేది చూడాలి. కొన్ని పాలసీలు బహుళ వ్యాధులకు కూడా పరిహారం అందిస్తూ ఉంటాయి. మరికొన్ని ఒక వ్యాధికి మాత్రమే పరిహారం అందిస్తాయి. తర్వాత సదరు పాలసీ రద్దు అవుతుంది.

వెయిటింగ్ పీరియడ్
ఇన్సూరెన్స్ పాలసీలకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకున్న నాటి నుంచి కనీసం 30 రోజుల నుంచి 90 రోజుల పాటు జీవించి ఉండాలనేది ప్రధాన నిబంధన. పాలసీ తీసుకున్న తర్వాత 6 నెలల నుంచి 12 నెలల తర్వాత వ్యాధిని గుర్తిస్తేనే పరిహారం అందుతుంది. కనుక ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేటప్పుడు, వేచి ఉండే వ్యవధి (వెయిటింగ్ పీరియడ్​) తక్కువగా ఉండే పాలసీని ఎంచుకోవాలి.

క్లెయిం చేయడమెలా?
జాబితాలో ఉన్న తీవ్రమైన వ్యాధి బారిన పడినప్పుడు, ఆ విషయాన్ని బీమా సంస్థకు వీలైనంత వేగంగా తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే తగిన ఆధారాలు చూపించి, దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే బీమా కంపెనీ మీ క్లెయింను పరిశీలించి, పరిహారం అందిస్తుంది. అందుకే పాలసీ తీసుకునేటప్పుడు మంచి పేమెంట్ హిస్టరీ ఉన్న బీమా సంస్థను ఎంచుకోవాలి.

మంచి క్రెడిట్​ కార్డ్​ను సెలెక్ట్ చేయాలా? ఈ టాప్​-7 టిప్స్ మీ కోసమే! - How To Choose The Right Credit Card

లాంగ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ కారులో ఈ 6 వస్తువులు కచ్చితంగా ఉండాల్సిందే! - Road Trip Essentials

ABOUT THE AUTHOR

...view details