Credit Card Minimum Payment :ఏదైనా ముఖ్యమైన పనికి డబ్బు అవసరమైనప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటారు. అలా తీసుకున్న డబ్బును తిరిగి నెలరోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే సరిగ్గా ఇలాంటి సమయంలోనే కనీస మొత్తం చెల్లింపు ఆప్షన్ చాలా మందిని ఆకర్షిస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా కొంత ప్రయోజనం కలిగినప్పటికీ దీర్ఘకాలం పాటు ఇలా కొనసాగిస్తూ ఉంటే, ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఈ కనీస చెల్లింపు ఆప్షన్‌ను ఉపయోగించాలి? ఎంత కాలానికి ఉపయోగించుకుంటే మంచిది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
స్వల్పకాలానికే
కనీస మొత్తం చెల్లించి క్రెడిట్‌కార్డును ఉపయోగించేవారు, ఈ అవకాశాన్ని ఒక నెల, లేదా రెండు నెలల పాటు సర్దుబాటు కోసం ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రతీసారి ఇలా కొనసాగించుకుంటూ పోతే ఆర్థిక భారం తప్పదు. ముఖ్యంగా సకాలంలో బిల్లు చెల్లించకపోతే, నిర్ణీత శాతం వడ్డీని, అదనపు రుసుములను, పెనాల్టీని చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల క్రెడిట్‌కార్డులను సరిగా మేనేజ్ చేయడం రాకపోతే, ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాన్ని గుర్తించుకోవాలి.
లెక్క ఇలా?
క్రెడిట్ కార్డుపై మీరు రూ.20,000 వాడుకున్నారని అనుకుందాం. మొత్తం సొమ్ములో కనీసం 5 శాతాన్ని కనీస చెల్లింపు చేయాల్సి ఉంటుంది. అంటే రూ.1,000 మీరు చెల్లించాలి. మిగతా రూ.19వేలు మరుసటి నెల బిల్లుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మొత్తం రూ.20వేలపై సంస్థ నిబంధనల ప్రకారం మీరు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు అదనపు రుసుములూ ఉంటాయి.
ఇలాంటిదే మరో ఉదాహరణ చూద్దాం. క్రెడిట్ కార్డుపై తీసుకున్న లోన్ రూ.50వేలు అనుకుంటే అందులో కనీస మొత్తం 5 శాతం చెల్లించాలి. అంటే రూ.2,500 కట్టాల్సి ఉంటుంది. బాకీ ఉన్న మొత్తంపై 36శాతం వార్షిక వడ్డీరేటు అనుకుంటే రూ.1,500 అవుతుంది. దీనికి అదనంగా రూ.100 ఆలస్య రుసుము చెల్లించాలి. అంటే మీరు మొత్తంగా రూ.4,100 చెల్లించాల్సి ఉంటుంది. చిన్న మొత్తాలు లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ భారం తక్కువగానే ఉంటుంది. కానీ రూ.1లక్ష వరకు బిల్లు చెల్లించాల్సి వస్తే, నెలకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీకు తీవ్రమైన ఆర్థిక భారం అవుతుంది. అందువల్ల ఎక్కువ మొత్తంలో బిల్లు చెల్లించాల్సి వచ్చినప్పుడు నెలవారీ వాయిదాల్లోకి మార్చుకునేందుకు అవకాశం ఉందేమో చూసుకోండి. దీనిపై 14 శాతం వరకూ వడ్డీ ఉంటుంది.
ప్రత్యేక సందర్భాల్లోనే ఉపయోగించండి
- కనీస మొత్తం చెల్లింపు వెసులుబాటును కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే వినియోగించుకోవాలి.
- కనీస మొత్తం చెల్లింపు వల్ల క్రెడిట్ స్కోరు తగ్గకుండా చేసుకోవచ్చు.
- మొత్తం చెల్లించకుండా ఉండటం కన్నా ఇది కొంతవరకు ఉపయోగకరమే.
- క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం ఆలస్యమైతే పెద్ద మొత్తంలో ఫైన్ చెల్లించాల్సి వస్తుంది.
- అలాంటప్పుడు కనీస మొత్తం చెల్లించడం ద్వారా ఈ భారాన్ని తప్పించుకోవచ్చు.
- లోన్ చెల్లించకుండా ఎక్కువ నెలలు వాయిదాలు వేయడం సాధ్యం కాదు. దీనివల్ల బ్యాంకుతో మీ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.
- గడువు తేదీలోగా బిల్లు చెల్లించకపోతే ఆలస్యపు రుసుము, వడ్డీల భారంతోపాటు సిబిల్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
- నష్టాలే ఎక్కువ :బిల్లులో కనీస మొత్తం చెల్లింపు వల్ల తాత్కాలికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. అయినప్పటికీ దీని వల్ల దీర్ఘకాలంలో నష్టాలు ఉంటాయి. అందువల్ల ఈ కనీస మొత్తం సౌలభ్యాన్ని అనివార్యం అయితే తప్ప ఉపయోగించకపోవడమే మంచిది.
- వడ్డీ భారం: కనీస మొత్తం చెల్లిస్తూ వెళ్తుంటే ముందుగా వడ్డీ భారం ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. క్రెడిట్ కార్డులు సాధారణంగా ఎక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థలు బాకీ ఉన్న మొత్తంపై 36 నుంచి 48 శాతం వరకూ వడ్డీని విధిస్తున్నాయి. దీన్ని చెల్లించేందుకు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.
- అప్పుల ఊబి : నిర్ణీత శాతమే బిల్లు చెల్లిస్తూ ఉంటే ఎప్పటికీ ఆ రుణం తీరకపోవచ్చు. వడ్డీలు, రుసుములు ఇలా ఒకటికి మరోటి జత అవుతూ పెరుగుతుంటాయి. పూర్తిగా అప్పుల ఊబిలోకి వెళ్లే ఆస్కారం ఉంది. ఈ అప్పు ఒక దీర్ఘకాలిక భారంగా మారే అవకాశం ఉంది.
- అధిక పరిమితి : క్రెడిట్ కార్డు పరిమితిలో 30 శాతం మించి వాడకపోవడమే ఎప్పుడూ మంచిది. తీసుకున్నమొత్తం తీర్చకపోతే కార్డు వ్యయ నిష్పత్తి ఎప్పుడూ గరిష్ఠ స్థాయిలోనే ఉంటుంది. దీనివల్ల మీ సిబిల్‌స్కోర్‌పై ప్రభావం పడుతుంది. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం ఎప్పుడూ అవసరం. క్రెడిట్ కార్డులను వాడేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కార్డు బిల్లింగ్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
మీ లైఫ్ స్టైల్‌కు - ఏ క్రెడిట్ కార్డు మంచిదో తెలుసా?
క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్!