తెలంగాణ

telangana

ETV Bharat / business

నయా క్రెడిట్ కార్డ్ స్కామ్‌ - కార్డ్ లిమిట్ పెంచుతామంటూ బురిడీ - జర జాగ్రత్త! - NEW CREDIT CARD FRAUD

క్రెడిట్‌ కార్డ్ యూజర్లకు అలర్ట్ - కార్డ్ లిమిట్ పెంచుతామంటూ నయా స్కామ్ - సేఫ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే!

Credit Card Fraud
Credit Card Fraud (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 11 hours ago

New Credit Card Fraud : టెక్నాలజీ పెరుగుతున్న కొలదీ క్రెడిట్ కార్డ్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త జిమ్మిక్కులు వాడుతూ యూజర్లను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. తాజాగా మరో కొత్త క్రెడిట్ కార్డ్ స్కామ్‌ను ప్రారంభించారు. బ్యాంకు అధికారులు లాగా వినియోగదారులకు ఫోన్ చూస్తూ, క్రెడిట్ కార్డ్ లిమిట్‌ పెంచుతామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ఎవరైనా వీరి బుట్టలో పడితే చాలు - వారి నుంచే వారి క్రెడిట్ కార్డ్ వివరాలు అన్నీ తెలుసుకొని, మొత్తం సొమ్ము కాజేస్తున్నారు.

ఇంతకీ ఈ మోసం ఎలా చేస్తారంటే?
స్కామర్లు ముందుగా క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఫోన్ చేస్తారు. తాము బ్యాంక్ అధికారులమని నమ్మిస్తారు. వారి క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను మరింత పెంచుతామని ఆఫర్ ఇస్తారు. యూజర్లను తమ మాటలతో పూర్తిగా నమ్మిస్తారు. తరువాత క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకునేందుకు అంటూ - ఓ ఫిషింగ్‌ లింక్‌ను పంపిస్తారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే, అచ్చంగా మీకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసిన బ్యాంక్‌కు చెందిన ఒరిజినల్ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లానే కనిపిస్తుంది. అందులో మీ క్రెడిట్ కార్డుకు సంబంధించిన అతి సున్నితమైన సమాచారం నమోదు చేయాలని సూచనలు ఉంటాయి. అంటే మీ క్రెడిట్ కార్డ్ నంబర్‌, వినియోగదారుని పేరు, కార్డ్ టైప్‌, సీవీవీ, ఎక్స్‌పైరీ డేట్‌ మొదలైన వివరాలు నమోదు చేయాలని ఉంటుంది. అలాగే మీ ఈ-మెయిల్ అడ్రస్‌, పాన్, ఆధార్ వివరాలు కూడా నమోదు చేయాలని సూచిస్తుంది. పొరపాటున మీరు కనుక ఆ వివరాలు నమోదు చేశారో, ఇక అంతే సంగతులు. స్కామర్లు ఆ డేటా ఉపయోగించుకుని మీ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చాలా విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు మొబైల్ ఫోన్స్‌, బంగారం, వెండి కాయిన్స్ లాంటి వాటిని ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ ద్వారా కొనుగోలు చేస్తారు. అంటే యూజర్లకు తెలియకుండానే వారి సొమ్మును అక్రమంగా కాజేస్తారు. కనుక ఇలాంటి క్రెడిట్ కార్డ్ మోసాల విషయంలో వినియోగదారులు అందరూ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

క్రెడిట్ కార్డ్ మోసాల నుంచి సేఫ్‌గా ఉండడం ఎలా?

  • ఎవరైనా మీకు ఫోన్ చేసి, క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని, లేదా ఆఫర్స్, రివార్డ్స్‌ ఇస్తామని ఆఫర్‌ చేస్తే సున్నితంగా వాటిని తిరస్కరించండి.
  • మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలని అనుకుంటే, నేరుగా బ్యాంక్‌కు వెళ్లి, పూర్తి వివరాలు తెలుసుకోండి.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానాస్పద లింక్‌లను, ఇతరులు పంపే లింక్‌లను ఓపెన్ చేయకండి.
  • కేవలం గూగుల్ ప్లేస్టోర్‌, యాపిల్ యాప్‌ స్టోర్‌ల నుంచి మాత్రమే అధికారిక యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. థర్డ్ పార్టీ సోర్స్‌ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు.
  • తరచూ మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్లను చెక్ చేసుకోండి. దీని వల్ల ఏవైనా అనధికారిక లావాదేవీలు జరిగితే వెంటనే తెలుసుకోవచ్చు. బ్యాంకులకు ఫిర్యాదు చేసి, ఆర్థిక మోసాల నుంచి బయటపడవచ్చు.
  • కచ్చితంగా ట్రాన్సాక్షన్ అలర్ట్‌లను సెటప్ చేసుకోవాలి. అంటే మీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరిగినా వెంటనే మీకు అలర్ట్ వచ్చేలా చూసుకోండి.
  • క్రెడిట్ కార్డ్ యుసేజ్ లిమిట్ కూడా సెట్ చేసుకోండి.
  • మీ క్రెడిట్ కార్డ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వకండి. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే, క్రెడిట్ కార్డ్ మోసాల నుంచి సురక్షితంగా ఉండే ఛాన్స్ ఉంటుంది.

ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా? మీ క్రెడిట్ కార్డ్ డేటాను ప్రొటక్ట్‌ చేసుకోండిలా!

క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్​ను​ కంపెనీలు ఇవ్వడం లేదా? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్!

ABOUT THE AUTHOR

...view details