Child Education Plan :తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత విద్యకు చాలా ప్రాధాన్యమిస్తున్నారు. గత 20 ఏళ్లలో విద్యారంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే మార్పలకు తగ్గట్టుగా ఖర్చులు కూడా భారీగానే పెరిగాయి. ముందస్తు ప్రణాళిక వేసుకుని వ్యవహరించేవారు మాత్రమే ఈ ఉన్నత విద్య ఖర్చుల విషయంలో సక్సెస్ అవ్వగలరు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యను ఒక ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడడం ప్రారంభించారు. అందువల్ల పిల్లలు పసిప్రాయంలో ఉన్నప్పుడే పెట్టుబడులు పెట్టడం ఆరంభించాలి. మదుపు ఆలస్యం అయ్యేకొద్దీ కార్పస్ సరిపోక ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత విద్య కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చక్కని ఆర్థిక ప్రణాళికతో ముందుకెళ్లాలి.
ముందస్తు మదుపు ప్రణాళిక
పిల్లల కళాశాల విద్య అనేది దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం. ఇది 18 నుంచి 20 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఇంత సమయం ఉంది కదా అని చాలా తల్లిదండ్రులు తమ పెట్టుబడులను ప్లాన్ చేయడానికి ఆలస్యం చేస్తుంటారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఒక్క సంవత్సరం ఆలస్యం చేయడం వల్ల కూడా పెట్టుబడి మొత్తంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మీ బిడ్డ పుట్టిన వెంటనే పెట్టుబడులు ప్రారంభించారు అనుకుందాం. 12% సగటు రాబడితో 20 ఏళ్లలో రూ.1 కోటి ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి నెలకు రూ.10 వేల కంటే కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. ఇదే లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టుబడిని రెండు ఏళ్లు ఆలస్యం చేశారనుకుంటే, నెలకు రూ.13,100 మదుపు చేయాలి. అదే 5 ఏళ్లు ఆలస్యం చేస్తే, నెలకు రూ.20 వేల వరకు మదుపు చేయాలి. అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి పొదుపును 10 ఏళ్లకు కుదిస్తే, నెలకు రూ.43 వేలకు పైగానే సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రారంభ మొత్తం కంటే నాలుగు రెట్ల కంటే ఎక్కువ.
ప్రతీ ఏటా ఆలస్యం అయ్యేకొద్దీ ఉన్నత విద్య కోసం చేసే పొదుపు పెంచాల్సి ఉంటుంది. అందుచేత మదుపును ముందుగానే ప్రారంభించడం చేయాలి. దీనివల్ల ఆర్థిక ఒత్తిడి లేకుండా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందొచ్చు. అంతేకాకుండా అనుకోకుండా ఎదురయ్యే ఆర్థిక అత్యవసర పరిస్థితులు , ఆదాయంలో హెచ్చుతగ్గులు మీ పిల్లల విద్యా ప్రణాళికలకు అంతరాయం కలిగించవచ్చు. అందుచేతే ముందుగానే మదుపు ప్లాన్ చేయడం వల్ల ఇలాంటి ఆర్థిక సమస్యలను బ్యాలెన్స్ చేసుకోవచ్చు.
ద్రవ్యోల్బణం అంచనా
ప్రతీ ఏటా పిల్లల పాఠశాల, కళాశాల ఫీజులు పెరుగుతుంటాయి. అందువల్ల పిల్లల భవిష్యత్ విద్యా ఖర్చును తక్కువగా అంచనా వేయకూడదు. ద్రవ్యోల్బణాన్ని లెక్కించడంలో విఫలమైనట్లయితే అవసరమైన నిధులను సరిగ్గా అంచనా వేయలేం. దానికి కారణం సాధారణ ద్రవ్యోల్బణం సగటున 6-7% ఉంటే విద్యా ద్రవ్యోల్బణం 10-12% వరకు ఉంటుంది. దీనివల్ల ఉన్నత విద్యకు ఎవరూ ఊహించని ఫీజులు, ఖర్చులను భరించవలసి ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఉన్నత విద్యా కోర్సు ఫీజు రూ.15 లక్షలు అయితే, 18 ఏళ్లలో నిస్సందేహంగా చాలా పెరుగుతుంది. సగటు విద్యా ద్రవ్యోల్బణం రేటు 10% అనుకుంటే, 18 ఏళ్లకు ఇదే ఉన్నత విద్య ఫీజు రూ.84 లక్షలకు పెరుగుతుంది. విద్యా ద్రవ్యోల్బణం ఇంకా పెరిగిందంటే అధిక ఖర్చులకు దారితీస్తుంది. అందుచేత మీ భవిష్యత్ ఆర్థిక అవసరాలను నిర్ణయించేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోండి.
అనుబంధ ఖర్చులు
తమ పిల్లల చదువుల కోసం ఆలోచించేటప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ట్యూషన్ ఫీజులపై మాత్రమే దృష్టి పెడతారు. ఒక్క ట్యూషన్ ఫీజుతోనే విద్య పూర్తి అవ్వదు. ఉన్నత విద్యకు సంబంధించి అనేక ఇతరత్రా ఖర్చులుంటాయి. విద్యార్థి హాస్టల్, ఫుడ్, కోర్స్ పుస్తకాలు, విదేశీ చదువు అయితే కరెన్సీ ఎక్స్చేంజీ రుసుములు, జీవనశైలి ఖర్చులు, ట్రావెల్ ఛార్జీలు, పన్నులు వంటి ఇతర అనుబంధ ఖర్చులు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఖర్చులు కూడా ద్రవ్యోల్బణం వల్ల ఏటా పెరుగుతూ ఉంటాయి. అందుచేత నిధులు సేవింగ్ చేసేటప్పుడు ఈ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి.
మ్యూచువల్ ఫండ్లలో మదుపు
ఉన్నత విద్యకు దీర్ఘకాలంలో నిధులు అవసరం అవుతాయి. కనుక, మదుపు చేసేటప్పుడు సంప్రదాయ పెట్టుబడులవైపు చూడకపోవడమే ఉత్తమం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తేనే విద్యా ద్రవ్యోల్బణ ఖర్చులను తట్టుకునే అవకాశముంది. ఉదాహరణకు బ్యాంకు/పోస్టాఫీసులో ఆర్‌డీలో సగటున 7% రాబడితో ప్రతి నెలా రూ.10 వేలు చొప్పున పొదుపు చేస్తే 15 ఏళ్లకు రూ.31.88 లక్షలకు చేరుకుంటుంది. అదే మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తే సగటు రాబడిని 12 శాతంతో లెక్కకడితే రూ.50.45 లక్షలు వరకు లభించొచ్చు. పైగా మ్యూచువల్ ఫండ్లతో పోలిస్తే బ్యాంకు ఆర్‌డీలపై వచ్చే రాబడిపై అధిక ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లాంగ్‌టెర్మ్ మదుపుకు ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవడం వల్ల గరిష్ఠ రాబడితో పాటు, కొంత వరకు పన్ను ఆదా ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులపై రిస్క్‌ఎక్కువగా ఉంటుంది. మదుపుచేసేవారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.